మహువా వ్యాఖ్యల కలకలం.. రంగంలోకి మమత | Mamata Banerjee Apologize Over Mahua Moitra Gujarati Community Remark | Sakshi
Sakshi News home page

మహువా వ్యాఖ్యల కలకలం.. రంగంలోకి మమత

Apr 1 2026 11:18 AM | Updated on Apr 1 2026 11:25 AM

Mamata Banerjee Apologize Over Mahua Moitra Gujarati Community Remark

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సెగలు మరింతగా రాజుకుంటున్నాయి. తన వాగ్ధాటితో ఎప్పుడూ వార్తల్లో నిలిచే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ఎంపీ మహువా మోయిత్రా చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీని ఇరకాటంలో పడేశాయి. గుజరాతీ సమాజంపై ఆమె చేసిన విమర్శలు వివాదాస్పదం కావడంతో, స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగి క్షమాపణలు కోరాల్సి వచ్చింది.

అసలేం జరిగింది?
మూడు రోజుల క్రితం తృణమూల్ భవన్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మహువా మోయిత్రా స్వాతంత్ర్య పోరాటంలో బెంగాలీల పాత్రను ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘మీరు కాలాపానీ (అండమాన్ సెల్యులార్ జైలు)కి వెళ్లి చూస్తే అక్కడ ఎవరి పేర్లు కనిపిస్తాయి? అక్కడ ఎంతమంది గుజరాతీలు ఉన్నారు? జైలు శిక్ష అనుభవించిన వారిలో 68 శాతం మంది బెంగాలీలే.. ఆ తర్వాత పంజాబీలు ఉంటారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

భవానీపూర్‌లో సెగ.. దీదీ క్షమాపణలు
మహువా చేసిన ఈ వ్యాఖ్యలపై భవానీపూర్‌లోని గుజరాతీ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మమతా బెనర్జీ స్వయంగా పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గంలో గుజరాతీ ఓటర్ల సంఖ్య ఎక్కువ. దీంతో అప్రమత్తమైన టీఎంసీ నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వార్డు నంబర్ 70 కౌన్సిలర్ అసిమ్ బసు ద్వారా మమతా బెనర్జీ ఒక బహిరంగ క్షమాపణ లేఖను విడుదల చేశారు. ‘నా గుజరాతీ సోదర సోదరీమణులకు నేను వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నాను. మీ పట్ల నాకు ఎంతో గర్వం ఉంది. సంబంధిత ఎంపీ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అవి అత్యంత బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు. మేము వాటిని సమర్థించం’ అని మమత తన సందేశంలో పేర్కొన్నారు.

పార్టీ అనుమతి లేని వ్యాఖ్యలు
ఎంపీ మహువా మోయిత్రా పార్టీ అనుమతి లేకుండానే ఈ వ్యాఖ్యలు చేశారని కౌన్సిలర్ అసిమ్ బసు తెలిపారు. ఆయన తన సోషల్ మీడియా పోస్ట్‌ను హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ప్రత్యేకంగా గుజరాతీ భాషలోనూ విడుదల చేయడం గమనార్హం. గత ఎన్నికల్లో ఈ వార్డులో టీఎంసీ వెనుకబడి ఉండటంతో, ప్రస్తుతం ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో ఇటువంటి వ్యాఖ్యలు పార్టీకి చేటు చేస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: విచిత్ర వివాదం.. హైకోర్టుకు ’ఎన్‌డీఏ అంజలి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement