విచిత్ర వివాదం.. హైకోర్టుకు ’ఎన్‌డీఏ అంజలి’ | NDAs Anjali Nair moves HC to change name in ballot paper EVM | Sakshi
Sakshi News home page

విచిత్ర వివాదం.. హైకోర్టుకు ’ఎన్‌డీఏ అంజలి’

Apr 1 2026 8:54 AM | Updated on Apr 1 2026 9:05 AM

NDAs Anjali Nair moves HC to change name in ballot paper EVM

కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంటున్న వేళ ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. త్రిపుణితుర నియోజకవర్గం నుండి ఎన్‌డీఏ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రముఖ నటి అంజలి నాయర్ తన పేరు విషయంలో కేరళ హైకోర్టును ఆశ్రయించారు. బ్యాలెట్ పేపర్, ఈవీఎంలలో తన పేరును మార్చాలని ఆమె కోరుతున్నారు.

అసలు సమస్య ఏమిటి?
ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం.. అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు ప్రస్తుతం ‘అంజలి పీవీ’వి. అని ఉంది. అయితే ఓటర్లకు ఆమె ‘అంజలి నాయర్’ గానే సుపరిచితురాలు. ఒకవేళ ఈవీఎంపై అంజలి పీవీ అని ఉంటే, సామాన్య ఓటర్లు గుర్తుపట్టలేరని, ఇది తన గెలుపు అవకాశాలపై, ఓట్ల శాతంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కోర్టులో వాదనలు
తన ప్రచార సామాగ్రి, పోస్టర్లు, సోషల్ మీడియా పబ్లిసిటీ అంతా ‘అంజలి నాయర్’ అనే పేరుతోనే జరిగిందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నామినేషన్ పత్రాల్లో ఉన్న పేరుకు, ప్రచారంలో ఉన్న పేరుకు మధ్య వ్యత్యాసం ఉంటే ఓటర్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని అంజలి నాయర్ కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కేరళ హైకోర్టు.. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

సాంకేతిక ఇబ్బందులు
అయితే ఈ దశలో పేరు మార్పు చేయడం ఎన్నికల సంఘానికి పెను సవాలుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కేరళలో ఇప్పటికే కొన్ని విభాగాల్లో పోలింగ్ ప్రక్రియ మొదలైంది. వృద్ధులు, వికలాంగుల కోసం ఇంటి వద్ద నుంచే ఓటు వేసే విధానం  ఇప్పటికే ప్రారంభం కాగా, సర్వీస్ ఓటింగ్ కూడా త్వరలో మొదలుకానుంది. నామినేషన్ పత్రాల్లో ఉన్న పేరునే సాధారణంగా బ్యాలెట్ పేపర్‌పై ముద్రిస్తారు కాబట్టి, ఇప్పుడు మార్పులు చేయడం ఎంతవరకు సాధ్యమనేది ఉత్కంఠగా మారింది.

ఇది కూడా చదవండి: కెనడా గ్యాంగ్‌వార్‌లో పంజాబ్‌ యువకుడి హత్య

Advertisement
 
Advertisement
Advertisement