సర్రే (కెనడా): కెనడాలో గ్యాంగ్‌వార్ కలకలం రేపింది. పంజాబ్ మూలాలు కలిగిన ఒక యువకుడిని దుండగులు సినిమా ఫక్కీలో వెంటాడి, తూటాలతో హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వాంకోవర్ సమీపంలోని సర్రే నగరంలో ఈ దారుణ హత్య చోటుచేసుకుంది.
ఏం జరిగిందంటే?
మృతుడిని 27 ఏళ్ల జస్మాన్ సెఖోన్గా పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి ఒక నివాస సముదాయం వద్ద జస్మాన్‌ను ఒక నల్లటి కారు వెంబడించింది. జస్మాన్ పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ, దుండగులు అతడిని చుట్టుముట్టారు. వాహనం నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు అతి సమీపం నుంచి జస్మాన్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని కాపాడే ప్రయత్నం చేసినా, ఫలితం లేకుండా పోయింది.
హత్య జరిగిన కొద్దిసేపటికే ఘటనా స్థలానికి సమీపంలో ఒక కారు తగలబడుతూ కనిపించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా కెనడాలో గ్యాంగ్‌స్టర్లు తమ ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు, హత్యకు వాడిన వాహనాలను తగులబెడుతుంటారని పోలీసులు చెబుతున్నారు. ఈ కాల్పులకు, దగ్ధమైన కారుకు సంబంధం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
డ్రగ్స్ మాఫియా హస్తం?
ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్‌ఐటీ)ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. జస్మాన్ సెఖోన్‌కు గతంలో డ్రగ్స్ వ్యాపారం, నేరగాళ్ల ముఠాలతో సంబంధాలు ఉన్నాయని, ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన 'టార్గెటెడ్ కిల్లింగ్' అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కాగా గత 48 గంటల్లో ఈ ప్రాంతంలో నాలుగు కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.
ఇది కూడా చదవండి: ‘దీదీ’ ఇలాకాలో సినీ తారల ధమాకా!


