న్యూఢిల్లీ: మనం తాగే మంచి నీటిని బాటిళ్లలో కొనుక్కోవడం మనకు అలవాటే.. అయితే పీల్చేందుకు స్వచ్ఛమైన గాలిని కూడా సీసాల్లో కొనుక్కునే రోజులు వచ్చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం నేపథ్యంలో ఒక వ్యక్తి ‘స్వచ్ఛమైన గాలి’ని విక్రయిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఢిల్లీలోని అత్యంత రద్దీ ప్రాంతమైన కన్నౌట్ ప్లేస్‌లో కనిపించిన ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ధర్మశాల నుంచి ‘ప్యూర్ ఎయిర్’..
హిమాచల్ ప్రదేశ్‌లోని కొండ ప్రాంతమైన ధర్మశాల నుంచి స్వచ్ఛమైన గాలిని ప్లాస్టిక్ సీసాల్లో నింపి తీసుకొచ్చినట్లు గాలి విక్రయదారు చెబుతున్నాడు. అతను ఒక్కో బాటిల్ ధర రూ. 50 గా నిర్ణయించాడు. వినడానికి వింతగా ఉన్నప్పటికీ, కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీ వాసులు ఈ ‘స్వచ్ఛమైన గాలి’ అనుభవం కోసం క్యూ కడుతున్నారు. ఆ బాటిళ్లు కొనుక్కుని పీలుస్తూ ‘నిజంగానే ఢిల్లీ గాలికంటే ఇది చాలా భిన్నంగా, హాయిగా ఉంది’ అని కొనుగోలుదారులు అభిప్రాయపడటం గమనార్హం.
This guy sold “air” from Dharamshala for ₹50 to people in Delhi, and those buying it actually said it felt different from Delhi’s air. What looks like a random video today could turn into a real business and a harsh reality in the coming years, the bigger concern is whether even… pic.twitter.com/MS2nDwzj5A
— Nikhil saini (@iNikhilsaini) March 31, 2026
విషపూరితమైన గాలికి నిదర్శనం
ఢిల్లీలో కాలుష్య స్థాయిలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. మంగళవారం నాటి లెక్కల ప్రకారం నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 171 గా నమోదైంది. ఇది ‘పేలవమైన’ కేటగిరీ కిందకు వస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలు, వీచిన గాలులు కాలుష్యాన్ని కొంత మేర తగ్గించినప్పటికీ, పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు.
ముంచుకొస్తున్న ముప్పు?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ రోజు ఇది ఒక ఫన్నీ వీడియోలా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో గాలిని ఇలాగే కొనుక్కోవాల్సి రావడం ఒక చేదు నిజం కాబోతోంది’ అని ఒక యూజర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఇది ఒక వింత వ్యాపారంగా కనిపిస్తున్నా, పర్యావరణాన్ని కాపాడుకోకపోతే రేపు అందరి పరిస్థితి ఇలాగే ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: విచిత్ర వివాదం.. హైకోర్టుకు ’ఎన్‌డీఏ అంజలి’


