జిమ్ ప్రియులకు ఏఐఎన్‍యూ (AINU) వైద్యుల హెచ్చరిక
హైదరాబాద్, మార్చి 26, 2026: ‘నో పెయిన్.. నో గెయిన్’ (కష్టం లేనిదే ఫలితం ఉండదు) అనే సూత్రాన్ని నమ్మి జిమ్‌లో మితిమీరిన కసరత్తులు చేయడం ప్రాణాల మీదకు తెస్తుందని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రోలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు హెచ్చరిస్తున్నారు. తక్కువ సమయంలోనే కండలుపెంచాలనే ఆరాటంతో చేసే కఠినమైన వ్యాయామాలు ‘రాబ్డోమయోలిసిస్’ (Rhabdomyolysis) అనే ప్రమాదకర పరిస్థితికి దారితీస్తాయని వారు స్పష్టం చేశారు.
ఒక్క రోజే 90 నిమిషాల కసరత్తు.. కిడ్నీలు ఫెయిల్!
ఇటీవల ఫిట్‌నెస్ కోసం మొదటి రోజే జిమ్‌కు వెళ్లిన 25 ఏళ్ల యువకుడు, త్వరగా ఫలితం రావాలనే ఉద్దేశంతో ఏకంగా 90 నిమిషాల పాటు స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్స్ మరియు పుష్-అప్స్ వంటి అత్యంత కఠినమైన వ్యాయామాలు చేశాడు. రెండు రోజుల తర్వాత అతనికి కండరాల నొప్పులు తీవ్రమవ్వడమే కాకుండా, మూత్రం రంగు మారి ‘కోలా’ లేదా టీ డికాషన్ రంగులోకి మారింది. పరిస్థితి విషమించడంతో అతను ఎమర్జెన్సీ వార్డులో చేరాడు. పరీక్షల్లో అతని శరీరంలో కండరాల విచ్ఛిన్నం వల్ల విడుదలయ్యే ‘మయోగ్లోబిన్’ స్థాయిలు పెరిగి, కిడ్నీలు దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. దీనినే ‘ఎక్సర్‌సైజ్ ఇండ్యూస్డ్ రాబ్డోమయోలిసిస్’ అంటారు.
ఏమిటీ రాబ్డోమయోలిసిస్?
కండరాలు విపరీతంగా అలసిపోయినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు వాటిలోని కణాలు విచ్ఛిన్నమై ‘మయోగ్లోబిన్’ అనే ప్రోటీన్‌ను రక్తంలోకి విడుదల చేస్తాయి. ఈ ప్రోటీన్ కిడ్నీలలోని సూక్ష్మ నాళాలను మూసివేస్తుంది (Clogging). దీనివల్ల కిడ్నీలు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా దెబ్బతింటాయి. సకాలంలో గుర్తించకపోతే డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
గుర్తించాల్సిన ప్రమాద సంకేతాలు:
వ్యాయామం చేసే వారు ఈ క్రింది లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
మూత్రం రంగు మారడం: మూత్రం కోలా లేదా టీ రంగులోకి మారడం అత్యంత ముఖ్యమైన సంకేతం.
తీవ్రమైన కండరాల నొప్పి: సాధారణ నొప్పి కంటే భిన్నంగా, కండరాలు వాపు రావడం.
నీరసం: విపరీతమైన అలసట లేదా కండరాల్లో శక్తి లేకపోవడం.
తక్కువ మూత్ర విసర్జన: రోజువారీ కంటే మూత్రం రావడం తగ్గిపోవడం.
వాంతులు: వికారం లేదా వాంతులు అవ్వడం.
సకాలంలో చికిత్సతో ప్రాణాపాయం నుంచి విముక్తి
ఈ యువకుడి కేసులో ఏఐఎన్‍యూ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ దీపక్ రాగూరి, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ క్రాంతి కుమార్ సమన్వయంతో చికిత్స అందించారు. రోగికి తగినంత ద్రవాలను అందిస్తూ (Aggressive Hydration),ఎలక్ట్రోలైట్ సమ తుల్యతను కాపాడటం ద్వారా కిడ్నీలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నట్టు హైటెక్ సిటీలోని ఏఐఎన్‍యూ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.
జిమ్‌కు వెళ్లే వారికి వైద్యుల సూచనలు
నెమ్మదిగా ప్రారంభించండి: మొదటి రోజే కఠినమైన వ్యాయామాలు వద్దు. క్రమక్రమంగా తీవ్రతను పెంచాలి.
నీరు ఎక్కువగా తాగాలి: వ్యాయామానికి ముందు, తర్వాత శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి.
విశ్రాంతి అవసరం: కండరాలు కోలుకోవడానికి వారంలో కనీసం ఒక రోజైనా విశ్రాంతి ఇవ్వాలి.
నొప్పిని భరించొద్దు: తీవ్రమైన నొప్పి ఉంటే వ్యాయామం ఆపేయాలి. పెయిన్ కిల్లర్స్ వేసుకుని మరీ జిమ్ చేయడం ప్రాణాంతకం.
"వ్యాయామం అనేది ఒక ఔషధం లాంటిది. అది సరైన మోతాదులో ఉన్నప్పుడే ఆరోగ్యం. శరీరం ఇచ్చే హెచ్చరికలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి," అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: తండ్రితో గొడవ, నాలుగేళ్ల బాలుడిపై ఇంత ప్రతీకారమా?


