27 ఏళ్లకే భర్త దూరం : రూ. 500తో మొదలై రూ.75 లక్షల టర్నోవర్‌ | A young widow built a business from waste From Rs 500 to Rs 75 lakh | Sakshi
Sakshi News home page

27 ఏళ్లకే భర్త దూరం : రూ. 500తో మొదలై రూ. 75 లక్షల టర్నోవర్‌

Jun 8 2026 4:15 PM | Updated on Jun 8 2026 5:24 PM

A young widow built a business from waste From Rs 500 to Rs 75 lakh

దృఢ సంకల్పానికి, స్ఫూర్తికి ప్రతీక ఆమె కథ. జీవితంలో అడుగడుగునా కష్టాలే అయినా పట్టుదలతో అద్భుతమైన విజయం సాధించింది.  అచంచల కృషితో తన జీవితాన్ని మార్చుకోవడం మాత్రమే కాదు, తన తోటివారికి  స్వీయ సాధికారత స్ఫూర్తి నందించిన మహిళ. కేవలం  రూ. 500 పెట్టుబడితో ప్రారంభమైన ఆమె వ్యాపారం నేడు ఏటా  రూ.75 లక్షల టర్నోవర్‌ సాధించే స్థాయికి చేరింది.ఎవరా మహిళ? ఆమె విజయ రహస్యం ఏంటి?  తెలుసుకుందాం ఈ కథనంలో

అస్సాంలోని నల్బారి జిల్లాకు చెందిన కనికా తాలూక్దార్ కథ ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయక ప్రయాణం.  27 ఏళ్ల వయసులోనే 2008లో ఒక రోడ్డు ప్రమాదంలో తన భర్తను కోల్పోయినప్పుడు ఆమె ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు.ఉన్నత చదువులు లేవు, స్థిరమైన ఆదాయం లేదు. ఉన్నదల్లా  నాలుగు నెలల కూతురు, అత్తామామలను పోషించేబాధ్యత. కానీ, ఆమె అధైర్యపడకుండా ఎదురొడ్డి నిలబడాలని నిర్ణయించుకుంది.

ఆమె చదివింది కేవలం 10వ తరగతి మాత్రమే. 2014లో  ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె  భవిష్యత్తుకు బంగారు బాట వేసింది. స్థానిక స్వయం సహాయక సంఘం (SHG)లో చేరారు. అక్కడ 'జీవిక సఖి'గా బాధ్యతలు చేపట్టడం వల్ల పొదుపు, బృందకృషి, చిన్న తరహా వ్యాపారాలపై ఆమెకు అవగాహన వచ్చింది.

రూ.500 పెట్టుబడితో ప్రయోగం
నల్బారిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ మనోషి చక్రవర్తి ఇచ్చిన వర్మీకంపోస్ట్ (వానపాముల ఎరువు) తయారీ శిక్షణ కనికను ఎంతగానో ఆకర్షించింది. దీనికి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదని గ్రహించిన ఆమె, కేవలం రూ. 500లతో తన తల్లిదండ్రుల ఇంటి పెరట్లో ఒక కిలో వానపాములతో వర్మీ కంపోస్ట్‌ వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టింది. పట్టుదల, నేర్చుకోవాలనే తపనతో, ఆమె తన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆవు పేడ ,ఆకుల వంటి స్థానికంగా లభించే వనరులను ఉపయోగించుకుంటూ, వర్మీకంపోస్టింగ్‌  తయారీ పనిని స్వీకరించింది.

మొదట్లో అనేక సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, కనిక పట్టుదల ఫలించింది. కొనేందుకు డబ్బుల్లేక చుట్టుపక్కల లభించే కూరగాయల వ్యర్థాలు, ఎండిన ఆకులను సేకరించి మొదటి బ్యాచ్ ఎరువును సిద్ధం చేసేది. ఇదే 'జయతు ఆర్గానిక్ ప్రొడక్ట్స్' సంస్థకు పునాది. రసాయన ఎరువులకు అలవాటు పడిన స్థానిక రైతులు మొదట్లో ఆమె సేంద్రియ ఎరువును కొనేందుకు అస్సలు ఆసక్తి చూపలేదు. కానీ కనిక వెనకడుగు వేయలేదు.

2018 నుండి ఆమె స్వయంగా రైతులను కలిసి, చిన్న చిన్న సంఘాలను ఏర్పాటు చేసి వర్మీకంపోస్ట్ వల్ల నేల తల్లికి జరిగే మేలును వివరించడంతో పాటు,  స్థానిక రేడియో ఛానళ్ల ద్వారా కూడా దీనిపై అవగాహన కల్పించేది. ఆమె పట్టుదలకు ఫలితంగా మెల్లమెల్లగా రైతులు ఆమె ఉత్పత్తులను నమ్మడం, కొనడం ప్రారంభించారు. సంవత్సరాలు గడిచేకొద్దీ, ఆమె తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది, తన కార్యకలాపాలను విస్తరించింది. తన ఉత్పత్తులను వైవిధ్యపరిచింది.  వర్మీకంపోస్ట్ వ్యాపారం నెలకు రూ. 3.5 లక్షల ఆదాయాన్ని ఆర్జించే  స్థాయికి ఎదిగింది.  

అలా 2017లో 'జయతు ఆర్గానిక్ ప్రొడక్ట్స్' బ్రాండ్‌ను అధికారికంగా రిజిస్టర్ చేశారు. 2019లో జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) మద్దతుతో ఆమె తన ఉత్పత్తులను Amazon, Flipkart , ప్రభుత్వ రంగ పోర్టల్ GeM (Government e-Marketplace) లలో విక్రయించడం ప్రారంభించింది. GeM పోర్టల్ ద్వారా ప్రభుత్వ శాఖల నుండి పెద్ద మొత్తంలో వార్షిక కాంట్రాక్టులు రావడంతో వ్యాపారం స్థిరపడింది.

ఇదీ చదవండి : పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్

అస్సాం అగ్రికల్చరల్ యూనివర్సిటీ (NeedHub), IIM కలకత్తా,  NRETP ల నుండి ఆమెకు రూ. 27.50 లక్షల బిజినెస్ గ్రాంట్లు లభించాయి. ఈ నిధులతో ఆమె మౌలిక సదుపాయాలను పెంచుకున్నారు. కేవలం ఒకటిన్నర బిఘాల సొంత స్థలం నుంచే ఈ వ్యాపారాన్ని నడుపుతుండటం విశేషం.

ఇదీ చదవండి: ప్రియుడితో వధువు పరార్‌, చెల్లితో పెళ్లి ఫిక్స్‌, మళ్లీ ప్రియుడి లొల్లి!

నెలకు ఏకంగా 70 టన్నుల వర్మీకంపోస్ట్‌ను ఉత్పతి చేస్తూ, ఈ విక్రయాల ద్వారా ఆమె ఏడాదికి రూ. 70 లక్షల నుండి రూ.75 లక్షల ఆదాయాన్ని గడిస్తోంది. వర్మీకంపోస్ట్‌తో పాటు ఆర్గానిక్ పురుగుమందులు, ఆవు పేడతో చేసిన ధూప్ స్టిక్స్ (గోమయ అగర్‌బత్తి) కూడా తయారు చేస్తున్నారు. దీనికిగానూ 2019లో ICAR నుంచి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు.

భవిష్యత్తులో దేశవ్యాప్తంగా తన ఆన్‌లైన్ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని, అలాగే తనలాంటి ఎంతోమంది గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించి, రసాయన రహిత స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కనిక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక సాధారణ మహిళ అనుకుంటే  జీరో  నుంచే  తన వ్యాపార సామ్రాజ్యాన్ని  నిర్మించుకోగలదు అనేందుకు  కనికా తాలూక్దార్ జీవితమే ఒక సజీవ సాక్ష్యం.

ఇదీ చదవండి: రూ. 2 లక్షల జీతం, అయినా తిప్పలే : ఎలా ఈ సంసారం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement