సాక్షి, చైన్నె: సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్ స్పష్టత నిచ్చింది. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం పూర్తిగా సమర్థించారు. ‘మతసామరస్యం , రాష్ట్ర హక్కుల పరిరక్షణ అనే రెండు ప్రాథమిక సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నంత వరకు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు.గురువారం చైన్నెలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, తమిళనాడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఊహించని మహా విజయం
మీడియా, రాజకీయ విశ్లేషకులు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందకుండా టీవీకే పార్టీ ఎన్నికల్లో ఏకంగా 35 శాతం ఓట్లను కొల్లగొట్టిందని కొనియాడారు. పార్టీ స్థాపించిన కేవలం రెండేళ్లలోనే ఇంతటి ఘనవిజయం సాధించడం అద్భుతమని విజయ్‌ను అభినందించారు. తమిళనాడు ప్రజలు ఇప్పుడు మళ్లీ ముందస్తు ఎన్నికలను కోరుకోవడం లేదని చిదంబరం అభిప్రాయపడ్డారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోతే, రాష్ట్రపతి పాలన నెపంతో బీజేపీ దొడ్ది దారి గుండా అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉందని, అందుకే ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ప్రజాస్వామ్యబద్ధంగా సరైన నిర్ణయమని ఆయన విశ్లేషించారు.
ప్రస్తుత టీవీకే ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా 31 మంది మంత్రులకు అసెంబ్లీలో ఎలాంటి ముందస్తు అనుభవం లేదన్నారు. అలాగే 101 మంది ఎమ్మెల్యేలు మొదటిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టారని వివరించారు. వీరందరికీ కొంత సమయం ఇవ్వాలని చిదంబరం కోరారు. బీజేపీ నుండి బయటకు వచ్చి అన్నామలై ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభించడం గురించి స్పందిస్తూ, అది రాజకీయ పార్టీగా మారుతుందో లేదో నాకు తెలియదన్నారు. అయితే, బీజేపీలో ఆయనకు సరైన గుర్తింపు, గౌరవం దక్కలేదనే విషయం పలు ఇంటర్వ్యూలు చూస్తే స్పష్టంగా అర్థమవుతోందన్నారు. తాను ఇటీవల మాజీ సీఎం స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశానని, ఆయన ఇండియా కూటమి నుండి వైదొలుగుతున్నట్లు తనతో ఏమీ చెప్పలేదని వివరణ ఇచ్చారు.


