నటుడు నిళ్‌గల్ రవి
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయాల్లోకి వస్తారని అస్సలు ఊహించలేదని సీనియర్ నటుడు నిళ్‌గల్ రవి అన్నారు. షూటింగ్‌లో రాజకీయాల గురించి విజయ్ ఎప్పుడూ మాట్లాడేవారు కాదని, అలాంటిది పాలిటిక్స్‌లోకి ఎంటరై ముఖ్యమంత్రి కావడం తనకు ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
విజయ్ రాజకీయ ప్రయాణం ఊహించలేదు
విజయ్ ముఖ్యమంత్రిగా ఎదుగుతారని తాను ఎప్పుడూ ఊహించలేదని నిళ్‌గల్ రవి అన్నారు. "నేను విజయ్‌తో 'ఖుషి' (2000), 'తిరుమలై' (2003), 'కావలన్' (2011) చిత్రాల్లో కలిసి నటించాను. షూటింగ్ సమయంలో ఎన్నోసార్లు మాట్లాడినా, ఆయనలో రాజకీయాలపై ఆసక్తి కనిపించలేదు. నిజంగా ఇది నాకు పెద్ద ఆశ్చర్యమే. 1990ల మధ్యలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నాను. కానీ ఆ అవకాశం విజయ్‌కు రావడం ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండేవారు. తెరపై ఎలా భిన్నంగా కనిపిస్తారో, రాజకీయాల్లో కూడా 'సైలెంట్ డైనమైట్'గా తన సత్తా చాటార''ని కొనియాడారు.
అభిమానుల ప్రేమ అసాధారణం
'జన నాయగన్' సినిమాను అభిమానుల సమక్షంలో ధియేటర్‌లో చూసినట్టు వెల్లడించారు. "మదురైలో జన నాయకన్ సినిమా చూశాను. విడుదల రోజున అక్కడ షూటింగ్ ఉండటంతో ప్రత్యేకంగా అనుమతి తీసుకుని సినిమాకు వెళ్లాను. కమల్ హాసన్ 'నాయకన్' విడుదల సమయంలో చూసిన సంబరాల తర్వాత, ఇలాంటి అభిమానుల ఉత్సాహాన్ని ఇప్పుడు 'జన నాయకన్'కే చూశాను. విజయ్‌పై ప్రజలకు ఉన్న ప్రేమ, అభిమానం అసాధారణం. సినిమాలో నా పాత్రకు కూడా మంచి స్పందన వచ్చింది. చాలా ఏళ్లుగా మాట్లాడని వారు కూడా ఫోన్ చేసి అభినందించడం ఆనందంగా ఉంది" అని తెలిపారు.
నేరేషన్ అవకాశాలు పెరిగాయి
'జన నాయకన్' సినిమాలో స్క్రీన్ టైమ్ తక్కువే ఉన్నప్పటికీ, కథను ముందుకు నడిపే పాత్ర దక్కడం సంతృప్తినిచ్చిందని రవి చెప్పారు. "వాయిస్ యాక్టింగ్ ఎంత శక్తివంతమైన అంశమో 'కేజీఎఫ్' సినిమా తర్వాత అందరికీ తెలిసింది. అప్పటి నుంచి నాకు నేరేషన్ అవకాశాలు పెరిగాయి. 'జన నాయకన్'లో కూడా అలాంటి అవకాశం వచ్చింది. డాక్యుమెంటరీలకు నేరేషన్ ఇవ్వడం ఒకలా ఉంటే, సినిమాల్లో మాత్రం సన్నివేశానికి అనుగుణంగా స్వరంలో భావోద్వేగాలు జోడించే అవకాశం ఉంటుంది. దర్శకుడు వినోద్ నాపై పూర్తి నమ్మకం ఉంచి స్వేచ్ఛ ఇచ్చారు" అని తెలిపారు.
విలన్ పాత్రలకు సిద్ధమే
తన సినీ జీవితంలో ఎక్కువగా తెలివైన, అసలు స్వరూపాన్ని చివర్లో బయటపెట్టే పాత్రలే వచ్చాయని, కానీ పూర్తిస్థాయి విలన్ పాత్రలు మాత్రం ఎక్కువగా దక్కలేదని రవి తెలిపారు. "రజనీకాంత్‌తో చేసిన అనేక సినిమాల్లో మాయమాటలు చెప్పే, కుట్రలు పన్నే పాత్రల్లో కనిపించాను. దర్శకులు నన్ను అలాంటి పాత్రలకే ఎక్కువగా ఎంపిక చేశారు. అయితే బహిరంగంగా కనిపించే విలన్ పాత్రలు చేయడానికి కూడా నేను సిద్ధమే. నాకు పాత్రల పరిమాణం కంటే నటనపై ఉన్న ప్రేమే ముఖ్యమైనది. అందుకే పాత్రల కోసం ఎప్పుడూ వెతకాలేదు. వచ్చిన అవకాశాలనే స్వీకరించాను" అని చెప్పారు.
చదవండి: 23 ఏళ్లుగా కనిపించని ప్రముఖ నటుడు!
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం నిళ్‌గల్ రవి (Nizhalgal Ravi) కార్తీ–పీఎస్ మిత్రన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'సర్దార్ 2'లో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు చింబు దేవన్ రూపొందిస్తున్న కామెడీ చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.


