‘ఆ ప్రభుత్వ ఉద్యోగాలు చెల్లవు’.. సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ | Vijay Order On Jobs For Karur Stampede Victims Cancelled By Madras High Court | Sakshi
Sakshi News home page

‘ఆ ప్రభుత్వ ఉద్యోగాలు చెల్లవు’.. సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ

Jul 27 2026 5:39 PM | Updated on Jul 27 2026 6:27 PM

Vijay Order On Jobs For Karur Stampede Victims Cancelled By Madras High Court

సాక్షి,చెన్నై: మద్రాస్‌ హైకోర్టులో సీఎం విజయ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కరూర్‌ తొక్కిసలాట కుటుంబాలకు సీఎం విజయ్‌ అందించిన ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను రద్దు చేసింది.  

గతేడాది సెప్టెంబర్‌లో కరూర్‌లో టీవీకే నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తొక్కిసలాట జరిగి 41మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు నేతృత్వంలో తమిళనాడు రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం, సీబీఐ దర్యాప్తును కొనసాగిస్తున్నాయి.

ఈ క్రమంలో గత నెలలో సీఎం విజయ్‌ కరూర్‌ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలలోని 32 మందికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందించారు. ఆ నియామకాలపై దాఖలైన పిటిషన్లపై సోమవారం మద్రాస్‌ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో కరూర్‌ బాధిత కుటుంబాలకు సీఎం విజయ్‌ అందించిన ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు చెల్లవని స్పష్టం చేసింది. 

రాజ్యాంగ పరిమితులకు లోబడే వ్యవహరించాలని ఆదేశించింది. బాధితులకు ఆర్ధిక సాయం అందించవచ్చు. కానీ ఉద్యోగం ఇవ్వడం సమంజసం కాదని తెలిపింది. ప్రభుత్వ బస్సుల్లో మరణించినవారికి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తారా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగం అనేది అర్హత, నిర్దేశిత నియామక ప్రక్రియ (TNPSC వంటి పరీక్షలు) ద్వారా రావాలే తప్ప, ఇలా ఉచితంగా పంచేది కాదని స్పష్టం చేసింది.

ఇది సాధారణ అభ్యర్థుల సమానత్వ హక్కును దెబ్బతీస్తుందని పేర్కొంది. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ఎంతైనా ఆర్థిక సాయం అందించుకోవచ్చని, కానీ రాజ్యాంగ నిబంధనలు, పరిమితులను దాటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. అర్హత ఉన్నవారికే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా పెట్టేది కాదని వ్యాఖ్యానిస్తూ కరూర్‌ బాధితులకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని తీర్పు ఇచ్చింది. 

దీంతో సీఎంగా విజయ్‌కు తొలిసారి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే సీఎం విజయ్ తీసుకున్న ఈ ప్రతిష్టాత్మక నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చడం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement