పెరిగిన ఎయిడ్స్‌ మరణాలు | HIV Deaths Up in Mumbai, 1068 recorded in 2025-26 | Sakshi
Sakshi News home page

డేంజ‌ర్‌బెల్స్‌: పెరిగిన ఎయిడ్స్‌ మరణాలు

Jul 27 2026 6:39 PM | Updated on Jul 27 2026 6:41 PM

HIV Deaths Up in Mumbai, 1068 recorded in 2025-26

ముంబైలో గత నాలుగేళ్లలో గణనీయంగా పెరిగిన మృతుల సంఖ్య

కేవలం రెండేళ్లలో వేయికిపైగా రోగుల మరణం ∙ ‘న్యాకో’ నివేదిక ద్వారా వెల్లడి 

హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ నిర్మూలనకు అనేక కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం

అయినా వ్యాధి పీడితులు, మృతుల సంఖ్య పెరుగుదలపై ఆరోగ్యశాఖ ఆందోళన

ముంబై: ప్రాణాంతక హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ వ్యాధిని నిర్ములించేందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబైలో వ్యాధి పీడితులు, మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆరోగ్యశాఖను ఆందోళనకు గురిచేస్తోంది. గడచిన నాలుగేళ్లలో ఎయిడ్స్‌తో మృతిచెందినవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. గత రెండేళ్లలో వేయికిపైగా రోగులు మృతిచెందినట్లు ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది.

ఆ నివేదిక ప్రకారం కేవలం ముంబైలోనే 2022–23లో 958 మంది మృతి చెందగా, 2023–24లో 986 మంది, 2024–25లో 1,148 మంది, 2025–26లో 1,068 మంది మరణించారు. 2022–23తో పోలిస్తే 2025–26లో ఎయిడ్స్‌తో మృతి చెందిన రోగుల శాతం 19.83గా నమోదైంది. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ మృతుల సంఖ్యను నియంత్రించేందుకు ఆరోగ్య శాఖ అనేక కార్యక్రమాలు  చేపడుతోంది. అవగాహనా, ప్రచార కార్యక్రమాలను ఉధృతం చేసింది. అయినా రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదని నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్ (న్యాకో) వెల్లడించింది.

అందరి సహకారంతోనే నియంత్రణ సాధ్యం: డా. విజయ్‌ కరంజ్కర్‌
ఒకప్పుడు హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ వ్యాధి సోకిందంటే రోగులు ప్రాణాల మీద ఆశ వదులుకునే వారు.  ఇక తాము కొద్ది రోజులు మాత్రమే జీవిస్తామనే ధోరణితో బతుకీడుస్తుండేవారు. కానీ ఇప్పుడు అనేక  కొత్త కొత్త మందులు మార్కెట్లోకి వచ్చాయి. జీవితాంతం మందులు వాడితే ప్రాణాలు నిలబడతాయి. ఇలాంటి  రోగుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు అనేక సేవా, స్వయం సేవా సంస్ధలు కృషిచేస్తున్నాయి. ఏఆర్‌టీ కేంద్రం అందులో ఒకటి. ఈ కేంద్రం ఎయిడ్స్‌ రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తుంటుంది. కానీ అనేక నెలలుగా రోగులు పరీక్షలు చేయించుకునేందుకుగాని, మందులు తీసుకునేందుకుగాని ఈ కేంద్రానికి రాలేదు. దీంతో వీరంతా ఎక్కడున్నారు..? ఏమయ్యారు.

ఫాలో అప్‌కు ఎందుకు రావడం లేదన్న సందేహంతో గత రెండేళ్లుగా అంటే 2024, 2025 నుంచి ముంబై ఎయిడ్స్‌ నియంత్రణ సొసైటీ ఆధ్వర్యంలో ‘లాస్ట్‌ టూ ఫాలో అప్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈమేరకు  ఫోన్‌ ద్వారా రోగులు లేదా వారి బంధువులతో సంప్రదించడం, స్వయంగా ఇళ్లకు వెళ్లి వారినుంచి వివరాలను సేకరించడంతో రోగుల్లో అనేకమంది మరణించారని, వీరి వివరాలు ఏఆర్‌టీ కేంద్రంలో నమోదు కాలేదని తెలిసింది.

చ‌ద‌వండి: ఉత్కంఠ రేపుతున్న కార్పొరేషన్ల ఎన్నికలు 

ఇలా రెండేళ్లలో మృతిచెందిన వారిగురించి తెలిసిందని ముంబై జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ సొసైటీ ప్రాజెక్టు సంచాలకుడు డా.విజయ్‌ కరంజ్కర్‌ తెలిపారు. ఉచితంగా పరీక్షలు, మందులు పంపిణీ చేసినప్పటికీ హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ రోగులు కేంద్రానికి రాకపోవడం ఆందోళన కలిగిస్తోందని  కరంజ్కర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అందరి సహకారం ఉంటేనే ఎయిడ్స్‌ నియంత్రణలోకి వస్తుందని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement