ఎదురు చూస్తున్న ‘గ్రేటర్’ లీడర్స్
‘క్యూర్’లో ఈ సంవత్సరం ఎలక్షన్స్ జరిగేనా..?
మారుతున్న పరిణామాలు..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధి పెరిగింది. ‘క్యూర్’లో మూడు కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. గతంలో 150గా ఉన్న కార్పొరేటర్ల సీట్లు 300కు పెరిగాయి. ఆ సీట్లలో కూర్చునేందుకు పలువురు లీడర్లు ఉవ్విళ్లూరుతున్నారు. పూర్వ జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ముగిసినప్పటి నుంచీ, కొత్తగా ఏర్పాటైన మూడు కార్పొరేషన్లలో స్పెషలాఫీసర్ పాలన నడుస్తోంది. చట్టం మేరకు రద్దయిన పాలకమండళ్లకు ఆర్నెళ్లలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చేనెల పదో తేదీతో ఆ గడువు ముగియనుంది. కానీ, ఇంతవరకు ఎన్నికల అలికిడి లేదు.
ఈ సంవత్సరం చివర్లో ఈ ఎన్నికలు జరగనున్నట్లు ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుండగా, దానిపై కూడా సందేహాలు నెలకొన్నాయి. అందుకు కారణం కొత్తగా క్యూర్ చట్టం రానుండటం, డీలిమిటేషన్‌పై కోర్టు కేసులుండటం, తదితరమైనవిగా చెబుతున్నారు. దాదాపు 70 ఏళ్లనాటి జీహెచ్‌ఎంసీ స్థానే క్యూర్ వరకు కొత్త చట్టం తెచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఆమేరకు ముసాయిదా బిల్లు విడుదల చేసింది. ప్రజల సూచనలు, అభ్యంతరాలకు ఈ నెల 24 వరకు గడువుంది. అనంతరం బిల్లు.. చట్టరూపం దాల్చేందుకు సమయం పట్టనుంది.
వార్డుల విభజన వివాదం
గత డీలిమిటేషన్‌పై హైకోర్టులో కేసులున్నాయి. వార్డుల విభజనలో లోపాలున్నాయనే ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ఆ అభ్యంతరాలు ముగిసేంత వరకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండదని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వార్డుల సంఖ్య పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సైబరాబాద్ కార్పొరేషన్‌లో 76 వార్డులు, మల్కాజిగిరి కార్పొరేషన్‌లో 74 వార్డులున్నాయి. ఒక్కో కార్పొరేషన్‌లో వంద చేస్తారనే ప్రచారం కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీలో ఇప్పటికే 150 వార్డులున్నాయి. ఏ కార్పొరేషన్‌లోని వార్డుల్ని పెంచినా, వార్డులు, సరిహద్దులు మారతాయి. మరోవైపు మల్కాజిగిరి కార్పొరేషన్ (Malkajgiri Corporation) పరిధి చాలా ఎక్కువగా ఉండటంతో అక్కడ అధికారులకు సమస్యలు తలెత్తుతున్నాయి.
తెర వెనుక వ్యూహం
ప్రస్తుతం ఓటరు జాబితా ప్రక్షాళనకు సంబంధించిన ‘సర్’ కార్యక్రమం నడుస్తోంది. ఓటరు జాబితా అక్టోబర్ 10వ తేదీన వెలువడనుంది. ఆ తర్వాతే ప్రభుత్వం స్థానిక ఎన్నికల వైపు దృష్టి సారించే అకాశం ఉంది. అయినప్పటికీ, ఎన్నికల చూపుతోనే ప్రభుత్వం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసింది. ముఖ్యంగా, కొత్తగా ఏర్పడిన సీఎంసీ (CMC), ఎంఎంసీల్లో (MMC) వేల కోట్ల పనులు ప్రారంభించింది. ఆ పనుల పురోగతి కనిపించాక ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని రెండు భారీ ఫ్లై ఓవర్లు వచ్చేనెల ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఇంకోవైపు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఇవన్నీ ఎన్నికల చూపుతోనే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల బలం లేదు. ఈ పరిధిలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాగా వేయాలంటే, అందుకు కార్పొరేషన్ల ఎన్నికలే పరీక్షగా భావిస్తున్నారు.
చదవండి: జై జవాన్.. జై కిసాన్.. జై 'యువ'
ప్రతిపక్షాలు సైతం..
మరోవైపు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ (BJP) గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాయి. తిరిగి వాటిని నిలబెట్టుకోవడమే కాక, సీట్లు పెరిగినందున మరిన్ని ఎక్కువ సీట్లు పొందే యోచనలో ఇప్పటికే పరోక్షంగా ప్రచారం నిర్వహిస్తూ, ప్రభుత్వంపై విమర్శల బాణాలు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ల ఎన్నికలెప్పుడు అన్నది వివిధ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కోర్టు కేసులు, కొత్త చట్టం పూర్తయ్యాకే అయినా..త్వరితంగానా లేక జాప్యంతోనా అన్నదే ఇప్పుడు అందర్ని తొలుస్తున్న ప్రశ్న. ఏది ఏమైనా ట్రిపుల్ కార్పొరేషన్ల ఎన్నికలే రాబోయే రోజుల్లో ఆయా పార్టీలకు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల భవితవ్యాన్ని తెలుపనున్నాయి.


