‘కాక్రోచ్‌’కు పోటీగా ‘సుప్రీం’ మాజీ జడ్జి ‘ఇష్క్‌’ పార్టీ! | Ex SC Judge Katju Launches Ishq Karo Party to Fight Poverty, Slams CJP | Sakshi
Sakshi News home page

‘కాక్రోచ్‌’కు పోటీగా ‘సుప్రీం’ మాజీ జడ్జి ‘ఇష్క్‌’ పార్టీ!

Jun 9 2026 1:01 PM | Updated on Jun 9 2026 1:05 PM

Ex SC Judge Katju Launches Ishq Karo Party to Fight Poverty, Slams CJP

న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) హడావుడి నడుమ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కాట్జూ సరికొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘ఇష్క్ కరో పార్టీ’ (ఐకేపీ) పేరిట ఆయన సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇది కేవలం వ్యంగ్యంగా పెట్టిన పేరు కాదని.. దేశాన్ని పీడిస్తున్న నిరుద్యోగం, పేదరికం, బాలల్లో పౌష్టికాహార లోపం వంటి తీవ్రమైన సమస్యలపై పోరాడటమే ఈ పార్టీ ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు.

ప్రేమ కాదు.. సామాజిక ఐక్యత
ఈ విచిత్రమైన పేరు వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని జస్టిస్ కాట్జూ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. చాలామంది భావిస్తున్నట్లుగా ఇది ‘వాలెంటైన్స్ డే’ తరహా ప్రేమ వ్యవహారం కాదని, దేశంలోని విభిన్న వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించే సామాజిక తత్వమని ఆయన వివరించారు. ప్రజలందరూ తమ విభేదాలను పక్కనబెట్టి ఒకటైనప్పుడే దేశ సమస్యలు అంతమవుతాయని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ కొత్త పార్టీలోకి రావాల్సిందిగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాకు కాట్జూ బహిరంగంగా ఆహ్వానం పలికారు.

కాక్రోచ్ పార్టీ వ్యూహంపై కాట్జూ విమర్శలు
ఇటీవల నీట్ పరీక్షల వివాదంపై జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’, దాని వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే వ్యూహాలను కాట్జూ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న వారి డిమాండ్ అర్థరహితమన్నారు. ఒకవేళ ఆయన రాజీనామా చేసినా, మరో మంత్రి వస్తారని.. దానివల్ల వ్యవస్థలో వచ్చే మార్పు ఏముంటుందని ఎద్దేవా చేస్తూ అభిజీత్ దిప్కేను కాట్జూ విమర్శించారు.

ఇండియా కూటమిలో ‘కాక్రోచ్’ చర్చ
ఒకవైపు కాట్జూ ఈ కాక్రోచ్ పార్టీని కొట్టిపారేస్తున్నా, ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం ఈ డిజిటల్ ఉద్యమాన్ని గమనిస్తున్నాయి. ఇటీవల జరిగిన ‘ఇండియా’ కూటమి ప్రతిపక్షాల సమావేశంలో ఈ పార్టీ గురించిన చర్చ రావడం విశేషం. కొందరు నేతలు ఈ డిజిటల్ నెట్‌వర్క్ వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలపై అనుమానం వ్యక్తం చేయగా.. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా మాత్రం దీనిని సమర్థించారు. ఈ ఉద్యమం యువతలోని ఆగ్రహానికి ప్రతిరూపమని, వారు సరైన దారిలోనే వెళ్తున్నారని అభిప్రాయపడుతూ, ప్రతిపక్షాలు వారితో కలిసి పనిచేయాలని సూచించారు.

ఇది కూడా చదవండి: రిటైర్డ్ జడ్జి ఫ్యామిలీకి కిల్లర్ గ్యాంగ్‌ బెదిరింపులు

Advertisement
 
Advertisement
Advertisement