‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’ | Useless Fellows: Kharge Loses Cool at Congress Workers Over DK Chants | Sakshi
Sakshi News home page

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

Jun 22 2026 7:27 AM | Updated on Jun 22 2026 10:31 AM

Useless Fellows: Kharge Loses Cool at Congress Workers Over DK Chants

కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహనం కోల్పోయారు. కర్ణాటకలో నిర్వహించిన కాంగ్రెస్‌ ‘సంకల్ప సమావేష’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తుండగా.. కొందరు కార్యకర్తలు అత్యుత్సహం ప్రదర్శించారు. అయితే.. వద్దని వారిస్తున్న వాళ్లు అదే పని చేయడంతో ఖర్గేకు కోపమొచ్చింది. యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. అంటూ గట్టిగానే మందలించారాయన. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ‘సంకల్ప సమావేష’ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా.. సభలోని కొందరు కార్యకర్తలు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు మద్దతుగా ‘డీకే.. డీకే’ అంటూ నినాదాలు చేశారు.

దీంతో అసహనానికి గురైన ఖర్గే.. “ఇక్కడ మీరు నినాదాలు చేస్తే దేశమంతా ప్రభావితమవుతుందా? ఇది ఒక వ్యక్తి కార్యక్రమం కాదు.. పార్టీ కార్యక్రమం. మీరంతా పనికిమాలిన వాళ్లు(యూజ్‌లెస్‌ ఫెలోస్‌). ఇక్కడ వ్యక్తుల ఆరాధనకు స్థానం లేదు. మనందరినీ ఒక్కచోటికి తీసుకొచ్చేది పార్టీ మాత్రమే. అది గుర్తించండి” అంటూ మండిపడ్డారు.

తనకు 58 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని పేర్కొన్న ఖర్గే.. “ఎంతో మంది నాయకులు ఇక్కడికి వచ్చారు. వారి కంటే పార్టీ వారికి ఎక్కువ ఇచ్చింది. ఇక్కడ నినాదాలు చేసిన వారందరి వీడియో ఫుటేజ్‌ను పరిశీలిస్తాను. ఆ తర్వాత క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.

కార్యకర్తలు అలా నినాదాలు చేస్తున్న సమయంలో.. వేదికపైనే ఉన్న డీకే శివకుమార్‌ తన కుర్చీలోంచి లేచి ఆపమంటూ సైగలు చేశారు. అయినా కూడా వాళ్లు ఆగలేదు. ఆ సమయంలో వేదికపై కూర్చున్న మాజీ సీఎం సిద్ధరామయ్య డీకేను చూస్తూ ఉండిపోయారు.

ఖర్గే వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్‌లో వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమనే సందేశాన్ని ఇవ్వడానికే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సభలో డీకే శివకుమార్‌ అనుచరుల నినాదాలపై ఖర్గే బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం కర్ణాటక కాంగ్రెస్‌లోని అంతర్గత రాజకీయాలపై మరోసారి చర్చకు దారితీసింది. కేడర్‌ను ఉద్దేశించి ఖర్గే అంతలా మాట్లాడిన అవసరం లేదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement