కోలుకోలేని షాక్.. మమతా కోటలో మహువా చిచ్చు.. | Mahua Moitra praise Suvendu Adhikari | Sakshi
Sakshi News home page

కోలుకోలేని షాక్.. మమతా కోటలో మహువా చిచ్చు..

Jun 24 2026 8:05 PM | Updated on Jun 24 2026 8:17 PM

Mahua Moitra praise Suvendu Adhikari

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోగా, తాజాగా ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్, లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కార్చిచ్చు రేపాయి.

బీజేపీ అగ్రనేత,పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారిపై ఆమె అసాధారణ రీతిలో ప్రశంసలు కురిపించడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మహువా మొయిత్రా మాట్లాడుతూ.. తమ మధ్య ఉన్న రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి, సువేందు అధికారితో తనకున్న వ్యక్తిగత, భావోద్వేగ అనుబంధాన్ని బహిరంగంగా పంచుకున్నారు.

2014 పార్లమెంట్ ఎన్నికల్లో నాకు లోక్‌సభ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. ఆ రాత్రంతా ఏడ్చాను. ఆ క్లిష్ట సమయంలో సువేందు అధికారి నన్ను ఓదార్చి, ధైర్యం చెప్పారు.  2016 కరీంపూర్ శాసనసభ ఎన్నికల్లో తన గెలుపు కోసం సువేందు ఎంతో కృషి చేశారని, తన తరఫున మొదటి రాజకీయ ప్రచార ర్యాలీని ఆయనే నిర్వహించారు. ప్రస్తుతం ఇద్దరి రాజకీయ మార్గాలు వేరైనప్పటికీ.. ఆయనతో ఉన్న ఎమోషనల్ బాండింగ్‌ను నేనెప్పటికీ  మర్చిపోలేనని ఆమె స్పష్టం చేశారు.

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి అత్యంత విధేయురాలిగా, కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరంతరం విరుచుకుపడే నేతగా మహువా మొయిత్రాకు గుర్తింపు ఉంది. అలాంటి ఫైర్‌బ్రాండ్ లీడర్, ఇప్పుడు తృణమూల్ పార్టీ ప్రధాన శత్రువుగా భావించే సువేందు అధికారిని ప్రశంసించడంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆమె కూడా టీఎంసీని వీడి బీజేపీలో చేరే అవకాశం ఉందన్నచర్చ మొదలైంది. ఎన్నికల పరాజయం తర్వాత టీఎంసీ ఇప్పటికే బలహీనపడుతుండగా, మహువా మొయిత్రా కూడా త్వరలోనే పార్టీ మారే యోచనలో ఉన్నారా అనే చర్చకు ఈ ఇంటర్వ్యూ తెరలేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement