మహువా మొయిత్రా (ఎంపీ) రాయని డైరీ | Mahua Moitra Rayani Diary | Sakshi
Sakshi News home page

మహువా మొయిత్రా (ఎంపీ) రాయని డైరీ

Jun 28 2026 12:42 AM | Updated on Jun 28 2026 12:42 AM

Mahua Moitra Rayani Diary

మాధవ్‌ శింగరాజు

మనసు విప్పుకోవటం అన్నది ఒక లెక్క ప్రకారం జరిగేది కాదు. లెక్క ప్రకారం జరిగిందీ అంటే, అది మనసు విప్పుకోవటం అవదు, కప్పుకోవటం అవుతుంది. నచ్చిన దుస్తులు ఒంటికి వేసుకున్నట్లే, నప్పని బట్టలు మనసుకు తొడుక్కోవటం అవుతుంది. ఆ పని నేను ఎప్పటికీ చేయలేను. అందమైన చేనేతలు, ప్రకాశవంతమైన రంగులు నాకు నచ్చుతాయి. నా పెళ్లికి నేను లేత గులాబీ రంగు జరీ పట్టు చీరను ఎంచు కున్నాను. పెళ్లి రిసెప్షన్‌కి, లోక్‌సభలో నాపై నేర విచారణకు బ్రైట్‌ రెడ్‌; పార్లమెంటు సమావేశాలకు బ్రైట్‌ బ్లూ; పార్లమెంట్‌లో డిబేట్‌ కోసం ముదురు గులాబీ, ఆకుపచ్చ రంగులు; ఫుట్‌ బాల్‌ ఆడేటప్పుడు షూజ్‌ మీదికి ఎనర్జిటిక్‌ ఆరెంజ్‌ శారీ; హార్పర్స్‌ బజార్‌ మ్యాగజైన్‌  ముఖ చిత్రానికి మెజెంటా కలిసిన ఇండిగో హాండ్లూమ్‌ పట్టు చీర.

ఇక నా మొదటి పెళ్లిలో నేను ఏ రంగు చీరను కట్టుకున్నానో గుర్తు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అది వెలిసిపోయిన వివాహం. మొన్నటి బీబీసీ ‘టాక్‌ షో’కి తెల్లంచు ముదురు నారింజ రంగు చీరతో వెళ్లాను. ఎన్నికల్లో తృణమూల్‌ ఓటమి, పార్టీలో తీవ్ర సంక్షోభం, దీదీకి వ్యతిరేకంగా ఎంపీలు, ఎమ్మెల్యేల తిరుగుబాట్లు, బీజేపీకి మద్దతు ఇవ్వటం... వీటి గురించే కదా ‘టాక్‌ షో’లో అడుగుతారు. మనసుకు దుస్తులు తొడిగే అలవాటు లేనప్పుడు, ఉన్నది ఉన్నట్లే లోపల్నుంచి వచ్చేస్తుంది. మంచీ వస్తుంది, చెడూ వస్తుంది. మంచీ చెడుల మధ్య గుర్తొచ్చినవీ కొన్ని బయటికి వచ్చేస్తాయి. సువేందు గురించి కూడా నా మనసులో ఉన్నది ఉన్నట్లే మాట్లాడాను. తృణమూల్‌ నుంచి బీజేపీలోకి వెళ్లి, పశ్చిమ బెంగాల్‌కు సీఎం అయ్యారు సువేందు. తృణమూల్‌లో ఆయన మొదట్నుంచీ ఉన్నారు. తృణమూల్‌లో నేను చేరినప్పటి నుంచీ నాతో ఉన్నారు.

నాతో అంటే... నా నిరాశలో,నా నిస్పృహలో, నా దుఃఖంలో,నా అయోమయంలో నా వెంట ఉన్నారు. ‘‘రాజకీయాలు యూఎస్‌లోని మౌంట్‌ హోలియోక్‌ కాలేజీ నుండి అర్థ, గణిత శాస్త్రాలలో డిగ్రీ పట్టా పొందటంలా ఉండవు మొయిత్రా..’’ అనేవారు.‘‘జేపీ మోర్గాన్‌  చేజ్‌’లో సక్సెస్‌ఫుల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా ఉంటూ, వారి లండన్‌  కార్యాలయంలో వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి ఎదగటం లానూ ఉండవు..’’ అని నవ్వేవారు. 2014లో నాకు లోక్‌సభ టికెట్‌ రావాల్సింది. రాలేదు! సువేందు నన్ను ఓదార్చారు. నాకు ధైర్యం చెప్పారు. ఆయన తప్ప ఎవరూ నా కంటతడిని చూడలేదు! 2016లో తొలిసారి నేను అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసినప్పుడు నన్నంతా ఒంటరిని చేశారు. నా కోసం ప్రచారం చేయటానికైనా ఎవరూ రాలేదు.

సువేందు ఒక్కరే నా పక్కన నిలబడ్డారు. నా తొలి ర్యాలీలో నాకు బదులుగా ఆయనే ప్రసంగించారు. వేదికపైన సువేందు, నేను మాత్రమే ఉన్నాం. ఈరోజుకీ ఆ ఫొటోలు నా దగ్గర భద్రంగా ఉన్నాయి.  టాక్‌ షోలో కూడా ఇదే మాట చెప్పాను. ‘‘అయితే మీరూ సువేందులానో, మొన్నటి 20 మంది ఎంపీల్లానో త్వరలోనే తృణమూల్‌ని వదిలి వెళ్లబోతున్నారా?’’ అని పార్టీ లోపల, పార్టీ బయట నాపై సందేహాల సంధింపులు! పార్టీ లోపల ఉండి విధ్వంసం సృష్టించే నాయకుల కంటే, పార్టీని వీడిపోయి పార్టీపై బయటి నుండి పోరాటం చేసే నాయకుడిని నేను గౌరవిస్తాను. సువేందు పార్టీని వదిలి వెళ్లాక ఒక్కసారి కూడా నాకై నేను ఆయన్ని కలవలేదు. ఒక్కసారి కూడా నాకై నేను ఆయనతో మాట్లాడలేదు. టాక్‌ షోలో గత స్నేహాన్ని గుర్తు చేసుకున్నానంతే. గుర్తు చేసుకున్నంత మాత్రాన ఆయన పుణ్యాత్ముడని కాదు. గుర్తు చేసుకున్నందుకు నేనేమీ పాపాత్మురాలినైపోను.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement