ఇన్ బాక్స్
ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ అనంతరం పొందే పెన్షన్‌కు సంబంధించిన 15 ఏళ్ల కమ్యుటేషన్ రికవరీ అంశం ప్రస్తుతం చర్చ నీయాంశంగా మారింది. ఈ అంశంపై దాఖలైన ప్రత్యేక అనుమతి పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ నం. 26631/2025)లో భారత సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం లక్షలాదిమంది పెన్షనర్లలో కొత్త ఆశలను రేకెత్తించింది.
పదవీ విరమణ సమయంలో ఉద్యోగి తన నెలవారీ పెన్షన్ లో గరిష్ఠంగా 40 శాతం వరకు ఒకేసారి నగదు రూపంలో పొందే అవకాశాన్ని కమ్యుటేషన్ అంటారు. కుటుంబ అవసరాలు, గృహ నిర్మాణం, పిల్లల విద్య, వివాహాలు లేదా వైద్య ఖర్చుల వంటి అత్యవసర అవసరాలకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుంది. అయితే, ఈ మొత్తానికి బదులుగా కమ్యూట్ చేసిన పెన్షన్ భాగాన్ని నెలవారీ పెన్షన్ నుండి కోత విధిస్తారు. ప్రస్తుతం అమ లులో ఉన్న ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్స్ (కమ్యుటేషన్) రూల్స్–1944 లోని రూల్– 18 ప్రకారం పూర్తి పెన్షన్ పునరుద్ధరణ 15 సంవత్సరాల తరువాత మాత్రమే జరుగు తుంది.
రిటైర్డ్ తహసీల్దార్ బి.అప్పారావు సుప్రీంకోర్టు ముందు ఉంచిన ప్రధాన వాదన ఏమిటంటే, ప్రభుత్వం కమ్యుటేషన్ మొత్తాన్ని వడ్డీతో సహా సుమారు 11 సంవత్సరాల 3 నెలల్లోనే తిరిగి పొందుతోంది. అయినప్పటికీ, మరో నాలుగేళ్ల వరకు పూర్తి పెన్షన్‌ను పునరుద్ధరించకుండా కొనసాగించడం న్యాయ సమ్మతం కాదని ఆయన వాదించారు. తన విషయంలో కమ్యుటేషన్ మొత్తంతో పాటు వడ్డీ కలిపి సుమారు రూ.7.55 లక్షలు ప్రభుత్వం ఇప్పటికే తిరిగి పొందినట్లు పేర్కొన్నారు. కాబట్టి, 15 ఏళ్ల వరకు కోత కొనసాగించడం ప్రభుత్వానికి అనవసర ఆర్థిక ప్రయోజనం కల్పిస్తోందని పిటిషన్‌లో వివరించారు.
ఈ అంశంపై దాఖలైన పలు రిట్ పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2025 ఏప్రిల్ 28న తిరస్కరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన ప్రత్యేక అనుమతి పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. తుది తీర్పు వెలువడలేదు. నోటీసులు జారీ కావడం అంటే పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చిందని కాదు. కానీ ఈ కేసులో రానున్న తీర్పు ఒక వ్యక్తి లేదా ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా కమ్యుటేషన్ విధానాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
– టి.ఎం.బి. బుచ్చిరాజు, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ సంఘం


