అధికారం, పదవులు ఎప్పటికీ శాశ్వతం కావు.. కానీ నేర్పించిన విద్య మాత్రం జీవితాంతం తోడుంటుంది. పార్టీకి ఆ ప్రాంత ముఖంగా.. రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఓ మాజీ ఎంపీ.. ఇప్పుడు మళ్లీ తరగతి గదిలోకి అడుగుపెట్టారు. పదవి పోయిందని, అవమానాలు జరిగాయని కుంగిపోకుండా.. తనకు తెలిసిన విద్యా బాటనే ఎంచుకున్నారు. రాజకీయ కార్యకలాపాలకు దూరమై.. తిరిగి ఉపాధ్యాయ వృత్తిలో చేరడం ఆయన వ్యవహారం.. అందుకు చెప్పిన ఆసక్తికర కారణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
త్రిపురలోని తూర్పు త్రిపుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2019లో బీజేపీ తరఫున గెలిచిన రిబతి త్రిపుర(49).. తాజాగా అగర్తలాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మళ్లీ ఉపాధ్యాయుడిగా చేరారు. రాజకీయాల్లో అనుకున్నంత క్రియాశీల పాత్ర లేకపోవడం, పార్టీ పదవుల్లో చోటు దక్కకపోవడంతో ఆయన తన పాత వృత్తి వైపు మళ్లినట్లు తెలుస్తోంది.
ఎంపీగా ఎదిగిన ఉపాధ్యాయుడు
రిబతి త్రిపుర స్వస్థలం ధలాయ్ జిల్లా. చిన్న గ్రామం నుంచి వచ్చిన ఆయన రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2001లో అగర్తలాలోని మహాత్మా గాంధీ మెమోరియల్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేసిన ఆయన 2014లో బీజేపీలో చేరారు. గిరిజన ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎదిగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆయనకు తూర్పు త్రిపుర టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

రాజకీయంగా తగ్గిన ప్రాధాన్యం
అయితే కాలక్రమేణా ఆయన రాజకీయ ప్రాధాన్యం తగ్గింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆయనకు బదులుగా తిప్రా మోతా పార్టీ అధినేత ప్రద్యోత్ కిశోర్ దెబ్బర్మన్ సోదరి కృతి దేవి దెబ్బర్మన్‌ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆ తర్వాత కూడా రిబతి త్రిపుర బీజేపీ కోర్ కమిటీలో కొనసాగినప్పటికీ.. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా చురుకుగా కనిపించలేదు. తాజాగా పార్టీ ప్రకటించిన కొత్త కార్యవర్గ జాబితాలోనూ ఆయన పేరు లేకపోవడంతో రాజకీయ భవిష్యత్తుపై మరింత స్పష్టత వచ్చినట్లు అయింది. అయితే ఉద్దేశపూర్వకంగా ఆయన్ని పార్టీ పక్కన పెట్టిందనే ప్రచారం అక్కడ వినిపిస్తూ వచ్చింది. దానికి తగ్గట్లే ఆయన కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చేవారు.
‘రెండున్నరేళ్లుగా పని లేదు.. అందుకే తిరిగొచ్చా’
అయితే తన నిర్ణయంపై రిబతి త్రిపుర మాట్లాడుతూ.. గత రెండున్నరేళ్లుగా పార్టీ కోర్ కమిటీ సభ్యుడిగా తనకు ప్రత్యేక బాధ్యతలు ఏమీ లేవని తెలిపారు. “రాజకీయంగా నాకు ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక బాధ్యత లేదు. అందుకే నా పాత వృత్తి అయిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగానికి తిరిగి వచ్చాను” అని ఆయన పేర్కొన్నారు.
తిరిగి బోధనలో సౌకర్యంగా ఉంటే కొనసాగుతానని, లేకపోతే స్వచ్ఛంద పదవీ విరమణ గురించి ఆలోచిస్తానని చెప్పారు. అదే సమయంలో ఉపాధ్యాయ ఉద్యోగం తనకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను కూడా ఇస్తుందని తెలిపారు. నెలకు సుమారు రూ.50 వేల వరకు పెన్షన్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రాజకీయాల నుంచి.. తరగతి గదికి
రిబతి త్రిపుర తిరిగి పాఠశాలలో చేరడాన్ని సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వాగతించినట్లు తెలుస్తోంది. ఆయన నిబద్ధతతో బోధిస్తున్నారని పాఠశాల అధికారులు తెలిపారు. ఎంపీగా ప్రజా సమస్యలను ప్రస్తావించిన వ్యక్తి.. ఇప్పుడు మళ్లీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పనిలోకి రావడం ఆసక్తికర పరిణామంగా మారింది.
రాజకీయాల్లో విజయాలు, పరాజయాలు సహజమే. కానీ తనకు తెలిసిన రంగంలో తిరిగి అడుగుపెట్టి స్థిరత్వాన్ని ఎంచుకున్న రిబతి త్రిపుర నిర్ణయం.. పదవి కంటే వృత్తి విలువను గుర్తుచేస్తోంది.


