జ్యోతిర్మయం
దాసియైన మంధర మాటలు విని, కైకేయి దశరథుడిని కోరిన రెండు వరములతో, శ్రీరాముడికి జరగవలసిన పట్టాభిషేక కార్యక్రమం అకస్మాత్తుగా ఆగిపోయింది. అదేకాక, శ్రీరాముడు పదు నాలుగేళ్ళు వనవాసం చేయవలసిన విషమ పరిస్థితి ఏర్పడింది. శ్రీరాముడికి బహిప్రాణంలా ఉండే లక్ష్మణుడు ఈ హఠాత్పరిణామానికి తట్టుకోలేక దుఃఖంలో మునిగిపోయాడు.
‘చేతిలోకి వచ్చి స్వంతమయింది కదా అని భావించిన సంపద అంతలోనే పోవడం, అడవుల పాలవడం– ఇవి దైవనిర్ణయా లుగా జరుగుతాయే తప్ప మనుషుల వశంలో ఉండి జరిగేవి కావు తమ్ముడా!’ అని లక్ష్మణుడిని సమాధానపరిచాడు శ్రీరాముడు. తండ్రి మీద కూడా కోపంతో ఉన్న లక్ష్మణుడితో ఇంకా ఇలా చెప్పాడని ‘గోపీనాథ రామాయణము’ తెలిపింది.
మనుషుల జీవితాలలో లాభాలాభములను, సుఖదుఃఖములను, భయక్రోధములను, భవాభవంబులను ఏది కలుగజేస్తుందో అది దైవం అనబడుతుంది. విశ్వామిత్రాది తపోధనులు– జితేంద్రియులు అయ్యుండి కూడా– దైవంచే పీడితులగుచూ శక్తిమంతాలైన వారి నియమాలను విడిచిపెట్టినవారై కామక్రోధాసక్తులగుట తెలిసినదే కదా! ఈ లోకంలో కావలసినదిగా భావించబడే కార్యాన్ని కాకుండాచేసి, ఊహించని కార్యాన్ని, సంకల్పించని పరిణామాన్ని జరిగేటట్లుగా చేయడమే దైవకార్యంగా భావించి మనిషి సమాధానపడాలి. అటువంటి వివేకం కలిగిన బుద్ధితో, క్రోధాది ఇంద్రియ భావములను అదుపులో పెట్టుకుని ఆలోచించినపుడు అకస్మాత్తుగా తప్పిపోయిన
నా పట్టాభిషేక కార్యం గురించిన శోకం నాలో జనించదు.
తే. నాకు జూడ బ్రజాపాలనము కంటె
నవ్విపినవాస మధికోదయంబు గాన
ననఘ లక్ష్మీవిపర్యయమందు నీవు
మది విషాదంబు విడువుము మమత దక్కి. పట్టాభిషేకం చేయించుకుని ప్రజాపాలనం గురించిన పనులలో పడడం కంటె, అడవికి వెళ్ళి అక్కడ జీవితాన్ని గడపడంలోనే నాకు ఎక్కువ ఆనందం లభిస్తుంది. కాబట్టి రాజ్యా ధికారం అనే లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోయిందనే శోకాన్ని విడిచిపెట్టు. ప్రశాంతంగా ఉండు – అని చెప్పి శ్రీరాముడు లక్ష్మణుడిని శాంతపరిచాడు.
– భట్టు వెంకటరావు


