మాధవ్ శింగరాజు
సమస్య అనుకుంటే ప్రతిదీ సమస్యే. జెన్–జీ సమస్యే. పునర్విభజన బిల్లు సమస్యే. రామ మందిరంలో విరాళాల చోరీ సమస్యే. క్యాబినెట్ మార్పులూ సమస్యే. నిజంగా సమస్యలైనవి కొన్ని ఉంటాయి... అవసలు సమస్యలే కాదని ఎంత అనుకున్నా సమస్యలు కాకుండా పోనివి! ఆరెసెస్‌ను సంతోషంగా ఉంచటం నిరంతర సమస్య. ఒక్క ఏడాదైనా, ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు లేకుండా ఉండక పోవటం నిరవధిక సమస్య. ఆగస్టు 13తో వర్షాకాల సమావేశాలు ముగుస్తున్నాయి. సభ లోపల సమస్యలతో సమస్య లేదు. ఆ సంగతి స్పీకర్ ఓం బిర్లా చూసుకుంటారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు చూసుకుంటారు. స్పోక్స్ పర్సన్ సంవిత్ పాత్రా చూసుకుంటారు. మాటకు మాట చెప్పవలసి వస్తే ఎంపీ దినేష్ శర్మ చూసుకుంటారు. వీళ్ల కాక, చూసీ చూడనట్లు చూసుకునే ‘ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్’ రాజ్‌నాథ్ సింగ్, ‘నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’ అమిత్ షా ఎటూ ఉంటారు. టీమ్ అంతా కలిసి సమస్యలు కానివాటిని, సమస్యలు కానివాటితో డీల్ చేస్తుంది. చివరికి వచ్చేసరికి ఏదీ సమస్య కాకుండా పోతుంది. ఏదీ సమస్య కానప్పుడు, పడుకున్న 8 సెకన్ల లోపే గాఢ నిద్ర పట్టేస్తుంది.
ఒక దేశ ప్రధానికి పడుకున్న ఎనిమిది సెకన్లకే గాఢ నిద్ర పట్టేయటం దేశ సౌభాగ్యానికి సంకేతం. దేశ ఆర్థికాభివృద్ధికి సూచిక. ‘‘మా త్రివిధ దళాలు కళ్లు తెరిచే ఉన్నాయి’’ అని శత్రు దేశాలకు హెచ్చరిక. ‘‘దేశంలో శాంతి భద్రతలు లేవు’’ అని ఆరోపిస్తున్న ప్రతి పక్షాల నోటికి ఆనకట్ట. సభలో ఈ చివరి మూడు రోజులను కూడా మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సాగనిచ్చేలా లేరు. వాళ్ల ఆందోళన, నిరసన, డిమాండ్ ఒక్కటే... కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు ఎందుకు రావటం లేదో చెప్పాలని! తరగతి గదిలో అల్లరి చేస్తున్న పిల్లల మధ్యలోంచి ఒక మంచి విద్యార్థి లేచివెళ్లి, తరగతి బయట కాస్త దూరంగా చెట్టుకింద కూర్చుని తన క్లాస్ వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఉండటంలో జాతికి హితం కానిది ఏముంటుంది? వీళ్లు శీతాకాల సమావేశాలనైనా సజావుగా నడవనిస్తారా?! అప్పటికి ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’పై రిపోర్ట్ కూడా సిద్ధమై పార్లమెంటుకు వచ్చేస్తుంది. అదొస్తే, అందులోని ఏదో ఒక పాయింట్‌ను సపోర్ట్‌గా తీసుకుని పునర్విభజన బిల్లును మళ్లీ సభలో ప్రవేశపెట్టటానికి ఉంటుంది.
వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల ఎన్నికలున్నాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో ఇప్పుడున్నది బీజేపీ కనుక అక్కడ మళ్లీ బీజేపీనే వస్తుంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి కనుక అక్కడ ఈసారి బీజేపీ వస్తుంది. ఎన్నికలు సమస్య కాదు. సభలో బిల్లులు సమస్య కాదు. ఖర్గే, రాహుల్ సమస్య కాదు. ఆరెసెస్‌ను సంతృప్తి పరచటం ఒక్కటే సమస్య ఇప్పుడు! ‘‘జెన్–జీ ఆందోళనలో న్యాయం ఉంది’’ అని అంటున్నారు ఆరెసెస్ చీఫ్ మోహన్ భాగవత్! ‘‘విద్యార్థులపై పోలీసు చర్య వెనుక అసలేం జరిగిందో నాకు తెలుసుకోవాలని ఉంది’’ అంటున్నారు! ‘‘జెన్–జీని నేను గుడ్డిగా నమ్ముతాను’’ అంటున్నారు! జెన్–జీ వాదనను ఓపికతో వినాలని, వాళ్ల డిమాండ్లను ప్రేమతో అర్థం చేసుకోవాలని అంటున్నారు!
అంటే, చెట్టుకింద కూర్చుని క్లాస్ వర్క్ చేస్తున్న మంచి స్టూడెంట్‌ని మంత్రి వర్గం నుంచి డిబార్ చెయ్యాలని చెబుతున్నారా? జెన్–జీని ఇక్కడ ఎవరు మాత్రం గుడ్డిగా నమ్మటం లేదు?! జెన్–జీ వాదనను ఇక్కడ ఎవరు మాత్రం ఓపికతో వినటం లేదు?! అర్థం చేసుకోని వారికంటే కొన్నిసార్లు బాగా అర్థం చేసుకునేవారే సమస్యగా మారతారు. నిద్ర కూడా పట్టకుండా చేస్తారు.


