సంకేతమే అయినా మున్ముందు సవాలే! | Sakshi Guest Column On Saudi Arabia, Pakistan, Turkey | Sakshi
Sakshi News home page

సంకేతమే అయినా మున్ముందు సవాలే!

Aug 12 2026 1:11 AM | Updated on Aug 12 2026 1:11 AM

Sakshi Guest Column On Saudi Arabia, Pakistan, Turkey

మక్కా రక్షణ ఒడంబడిక: ఎర్డొగాన్‌(తుర్కియే), ఎమ్బీఎస్‌(సౌదీ), షాబాజ్‌(పాక్‌)

సందర్భం

సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియే ఆగస్ట్‌ 7న ‘మక్కా రక్షణ ఒడంబడిక’పై రియాద్‌లో సంతకాలు చేశాయి. దీనికి సైనికపరంగాకన్నా ఇతరత్రా ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఇది పశ్చిమాసియాలో నీరుగారుతున్న అమెరికా ప్రాభవాన్ని వెల్లడిస్తోంది. భద్రతా ప్రాధాన్యాల రీత్యా ఈ మూడు దేశాల మధ్యనున్న సారూప్యత బహు స్వల్పం. అమెరికా– ఇరాన్‌ మధ్య యుద్ధ పర్యవసానాలు సౌదీకి తలనొప్పిగా పరిణమించాయి. ఇరాన్‌తో దాని వైరం 1979 నుంచి సాగుతోంది. పాక్‌ దృష్టంతా భారత్‌పైనే. ‘నాటో’ కూటమిలో ఒకటిగా ఉన్న తుర్కియే అటు పశ్చిమాసియాలోనూ, ఇటు ఉత్తరాఫ్రికాలోనూ తన పలుకుబడిని పెంచుకోవాలని చూస్తోంది. ఆ ప్రాంతంలో నమ్మదగిన రక్షణ సామగ్రి ఎగుమతి దారుగా అవతరించాలని కోరుకుంటోంది. ఇలా వైరుధ్యాలున్నా రక్షణ కోసం ఈ మూడు దేశాలు ఒక వర్గంగా ఏర్పడటం ప్రతీకాత్మకంగా గణనీయమైనదే. ఇది మూడు భారీ మార్పులను ప్రతిబింబిస్తోంది: భిన్నమైన వ్యూహాత్మక, భద్రతా ప్రాధాన్యతలు; నూతన భద్రతా భాగస్వామ్యాల కోసం అన్వేషణ; అమెరికాపై ఇన్నాళ్ళూ ఉన్న నమ్మకం సడలిపోవడం.

అమెరికాపై పోతున్న ఆశలు
పశ్చిమాసియా, దానిని అనుకుని ఉన్న ప్రాంతాలు ఒక భద్రతా చట్రాన్ని కల్పించుకోవడంలో కొన్ని దశాబ్దాలుగా వాషింగ్టన్‌పైనే ఆధారపడుతూ వచ్చాయి. అమెరికా నుంచి ఆయుధాలు కొని సౌదీ అరేబియా దాని నుంచి భద్రతాపరమైన పూచీకత్తులు సంపాదించింది. తుర్కియే ఎలాగూ ‘నాటో’లో సభ్యురాలు. పాకిస్తాన్‌ ‘‘నాటో’యేతర ప్రధాన మిత్రపక్షం’.ఆరామ్‌కోపై జరిగిన ఇటీవలి దాడులపైనా, హౌతీలను కట్టడి చేయడంపైనా అమెరికా స్పందన పేలవంగా ఉందని సౌదీ భావిస్తోంది. సిరియా విషయంలో ‘నాటో’తో తుర్కియే చాలా ఏళ్లుగా ఘర్షణపడుతోంది. ఎఫ్‌–35 యుద్ధ విమానాల విక్రయాలు, కుర్దుల అంశం కూడా దాన్ని చిరాకుపరుస్తున్నాయి. అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా సేనలు వైదొలగడం, 2009 తర్వాత అమెరికా క్రమంగా భారత్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపించడంతో వ్యూహాత్మకంగా ఏకాకినవుతున్నానని పాక్‌ భావిస్తూ ఉండవచ్చు. రియాద్, అంకారా, ఇస్లామాబాద్‌ ఒకదానికొకటి రక్షణగా నిల వాలని నిర్ణయించుకోవడం గణనీయమైన పరిణామమే. ఈ ఒడంబడిక ప్రస్తుతానికి పస లేనిదిగా కనిపించవచ్చుకానీ, ఇక్కడ సంకే తానికే ఎక్కువ ప్రాధాన్యం. మూడు ప్రధాన ముస్లిం మెజారిటీ సైనిక శక్తులు చేతులు కలుపుతున్నాయి. పాకిస్తాన్‌ అమ్ములపొదిలో అణ్వస్త్రం ఉంది. తుర్కియేలో ప్రధాన రక్షణ సామగ్రి పరిశ్రమలు న్నాయి. సౌదీ అరేబియాకు చమురు నిల్వలు పుష్కలం.

ఇజ్రాయెల్‌కు సంకటమే!
ఈ మూడు దేశాల్లో ఏ దేశంపైన దాడి జరిగినా మిగిలిన రెండు దేశాలపైన కూడా దాడి జరిగినట్లుగానే భావించాలని పేర్కొంటున్న క్లాజు మక్కా ఒప్పందానికి ప్రాముఖ్యతను సంతరిస్తోంది. కాకపోతే, భాష అస్పష్టంగా ఉంది. ‘నాటో’ ఆర్టికల్‌ 5 తరహాలో, ఆటోమే టిక్‌గా యుద్ధానికి దిగుతామనే నిర్దుష్టమైన పదజాలాన్ని చేర్చలేదు. సమైక్య కమాండ్ల ప్రస్తావన లేదు. సంయుక్తంగా స్థావరాలు నిర్వహిస్తామని ఎక్కడా ప్రకటించలేదు. ఈ ఒడంబడిక తక్షణ సైనిక ప్రభావం పరిమితం కావచ్చు. కానీ, అస్పష్టతకు కూడా భౌగోళిక రాజకీయాల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఇది శత్రు దేశాల్లో అయోమయాన్ని సృష్టిస్తుంది. వాటి రక్షణ సన్నద్ధత ఖర్చును పెంచుతుంది. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు సంబంధించిన భద్రతా చర్చల్లో తల దూర్చాలని తుర్కియే చాలా కాలంగా అభిలషిస్తోంది. కానీ, గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్, అమెరికా దాన్ని దూరంపెడుతూ వచ్చాయి. ఇపుడు మక్కా ఒడంబడికతో తుర్కియే ఆ రకమైన చర్చల్లో పాల్గొనేందుకు ప్రవేశార్హత సంపాదించుకున్నట్లు అయింది. 

ఇది ఇజ్రాయెల్‌కు కంటక ప్రాయంగా మారడం ఖాయం. గాజాలో ఇజ్రాయెల్‌ చర్యలను తుర్కియే బాహాటంగా విమర్శిస్తోంది. మక్కా రక్షణ ఒడంబడికతో అటు తుర్కియే, ఇటు అణ్వస్త్ర సహిత పాకిస్తాన్‌ పశ్చిమాసియా భద్రతకు సంబంధించిన అధికారిక చర్చల్లో మొదటిసారిగా పాల్గొనేందుకు ప్రయత్నించవచ్చు. ఇంత కాలం అమెరికా నేతృత్వంలోని అబ్రహాం ఒప్పందాల గొడుగు నీడన ఇజ్రాయెల్‌ పనులు చక్కబెట్టుకుంటూ వస్తోంది. గల్ఫ్‌ కౌన్సి ల్‌తో సన్నిహిత సంబంధాలు నెరపుతోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా భద్రతాపరమైన సహకారాన్ని గుట్టుచప్పుడు కాకుండా అందిస్తోంది. తద్వారా, పాక్‌ను ఆమడదూరంలో ఉంచుతూ వస్తోంది. తాజా ఒడంబడిక ఈ సూత్రీకరణలన్నింటినీ అస్తవ్యస్తం చేస్తోంది. ఇజ్రాయెల్‌ను గుర్తించని పాక్‌కు గల్ఫ్‌ భద్రతా చర్చల బల్ల వద్ద కుర్చీ కల్పిస్తోంది. పాలస్తీనియన్ల తరఫున వకాల్తా పుచ్చుకున్నదిగా తనను చాటుకునే తుర్కియేకు సంస్థాపరమైన పరపతిని తెచ్చిపెడుతోంది.  

భారత్‌ ఎందుకు జాగ్రత్తపడాలి?
ఈ ఒడంబడికతో న్యూఢిల్లీకి సంబంధం లేదని అనడానికి లేదు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సిసలైన కాపలాదారుగా భారత్‌ తనను తాను చాటుకుంటూ వస్తోంది. సాగర జలాలకు సంబంధించినంతవరకు భద్రతకు నికరంగా భారత్‌ పైనే ఆధారపడ టానికి ప్రాధాన్యం ఇస్తారనే భావనపైనే ప్రధాని నరేంద్ర మోదీ తన ‘సాగర్‌’, ‘మహాసాగర్‌’ విధానాలను నిర్మించుకుంటూ వచ్చారు. సౌదీ అరేబియా 14 దేశాలతో కలసి జూలై 30న ఒక మారిటైమ్‌ సెక్యూరిటీ క్లస్టర్‌ను ప్రారంభించింది. కానీ ఈ గ్రూపులో భారత్‌ భాగంగా లేదు. భారతదేశానికి బదులుగా పాక్, తుర్కియేలతో రక్షణ అవగాహన కల్పించుకునేందుకు సౌదీ మొగ్గు చూపడాన్నే ఒక భౌగోళిక రాజకీయ సంకేతంగా తీసుకోవాలి. భారత్‌తో ఆర్థిక సంబంధాలు, ఇంధన వర్తకం వృద్ధి చెందుతున్నా, సంక్షోభం ముంచుకొస్తే, భారతదేశాన్ని ఒక ముఖ్యమైన భద్రతా భాగ స్వామిగా రియాద్‌ చూడదని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. పాకిస్తాన్‌ పరపతి పెరుగుతూండటం రెండవ అంశం. రెండు పవిత్ర మసీదులకు రక్షణదారుగా ఉన్న దేశంతోనూ, ఒక ‘నాటో’ సైనిక శక్తితోనూ రక్షణ ఒడంబడిక కుదుర్చుకోవడం ఇస్లామాబాద్‌కు దౌత్యపరమైన విలువ తెచ్చిపెడుతోంది. అంతర్జాతీయంగా పాక్‌ ఏకాకి అయిందనే కథనానికి ఇది గండికొడుతోంది. 

బలాబలాల మధ్య సమతూకాన్ని మక్కా రక్షణ ఒడంబడిక రాత్రికి రాత్రి మార్చేయకపోవచ్చు. సంయుక్త సున్నీ సైనిక శక్తి రేపటికి రేపే అవతరించకపోవచ్చు. కానీ, ఈ ఒడంబడిక రెండు చేదు వాస్తవాలను వెల్లడిస్తోంది. ఒకటి– కీలకమైన మధ్యవర్గ శక్తులు కేవలం అమెరికాపై ఆధారపడే ధోరణి నుంచి దూరం జరుగుతున్నాయి. రెండు– ఈ వైవిధ్యీకరణలో సిద్ధాంతాన్ని పక్కనపెట్టి, తక్షణ ఆచరణాత్మక దృక్పథంతో నూతన కూటములు ఏర్పడుతున్నాయి. ఢిల్లీ ఎదుట సునిశితమైన సవాల్‌ ఉంది. గల్ఫ్‌ నుంచి ఆగ్నేయాసియా వరకు భద్రతను కల్పించగల శక్తిగా అవతరించాలని కోరుకుంటున్న భారత్‌ తన ‘సాగర్‌’, ‘మహాసాగర్‌’ విధానాలను సౌదీ అరేబియా వంటి దేశాలు అక్కున చేర్చుకోగలిగినవిగా మలచాలి. 

సి. ఉదయ్‌ భాస్కర్‌
వ్యాసకర్త ‘సొసైటీ ఫర్‌ పాలసీ స్టడీస్‌’ డైరెక్టర్, న్యూఢిల్లీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement