ఎయిరిండియాకు షాక్‌ : రెట్టింపు ఫైన్‌ | Air India fined Rs 74K for charging student Rs 34K for extra baggage | Sakshi
Sakshi News home page

ఎయిరిండియాకు షాక్‌ : రెట్టింపు ఫైన్‌

Jun 9 2026 11:57 AM | Updated on Jun 9 2026 12:09 PM

Air India fined Rs 74K for charging student Rs 34K for extra baggage

విమానయాన సంస్థ ఎయిరిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.‘మహారాజా స్కాలర్ స్కీమ్’ వివాదంలో విద్యార్థినికి అనుకూలంగా వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. ‘మహారాజా స్కాలర్ స్కీమ్’ (Maharaja Scholar Scheme) నిబంధనలను అమలు చేయడంలో విఫలమైనందుకు  రూ. 74,131  జరిమానా  విధిస్తూ రాజస్థాన్ రాష్ట్ర వినియోగదారుల పరిష్కార కమిషన్ (State Consumer Redressal Commission) తీర్పునిచ్చింది.


2021లో అదనపు లగేజీ (Excess Baggage) కింద ఒక విద్యార్థిని నుండి రూ. 34,131లను ఎయిర్ ఇండియా అక్రమంగా వసూలు చేసింది. ఆ తర్వాత ఆమె ఈ పథకానికి అర్హురాలేనని  సంస్థ అంగీకరించినప్పటికీ, రీఫండ్ (డబ్బులు తిరిగి ఇవ్వడం)  ఇవ్వడంలో ఏళ్ల తరబడి జాప్యం చేసింది.  దీంతో ఆ విద్యార్థిని కన్జ్యూమర్‌ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సదరు విద్యార్థినికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

జిల్లా వినియోగదారుల కమిషన్ 2024  ఫిబ్రవరి నాటి ఆదేశాల ప్రకారం తనకు చెల్లింపులు చేయకుండా, ఆలస్యం చేయడంతోపాటు, తనను మానసిక క్షోభ గురి చేశారని జైపూర్ నివాసి లావణ్య మాగన్‌ ఆరోపించింది.  దీనికి అదనంగా  మరింత పరిహారం అందించాలని కోరుతూ అప్పీల్ దాఖలు చేశారు.  దీనిపై జుడీషియల్ మెంబర్ ముఖేష్, మెంబర్ దినేష్ కుమార్‌లతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.

ఫిర్యాదుదారైన విద్యార్థినిని అనవసరమైన మానసిక వేధింపులకు గురైందని, కోర్టు చుట్టూ తిరగడం వల్ల ఆమె విలువైన సమయం వృధా అయిందని కోర్టు విశ్వసించింది. కాబట్టి ఆమె పడిన మానసిక ఆవేదన పూర్తిగా సమంజసమైనదేనని మే 29న కమిషన్ వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల మధ్య పలుమార్లు ఉత్తరప్రత్యుత్తరాల తర్వాత, మాగన్ సదరు స్టూడెంట్ స్కీమ్‌కు అర్హురాలేనని స్వయంగా  సంస్థే అంగీకరించిందని వినియోగదారుల కమిషన్ తన తీర్పులో పేర్కొంది.

అసలు వివాదం ఏంటి? 
ఎయిరిండియా ప్రవేశపెట్టిన “మహారాజా స్కాలర్ స్కీమ్” ద్వారా అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే విద్యార్థులకు ప్రత్యేక లగేజీ అలవెన్స్ లభిస్తుంది. ఈ స్కీం కిందే యూకేలో చదువుకుంటున్న విద్యార్థిని లావణ్య మాగన్, లండన్‌నుంచి ఇండియాకు వచ్చేందుకు జూలై 21, 2021న ఎయిరిండియా టికెట్ బుక్ చేసుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో చెక్-ఇన్ చేసే సమయంలో ఆమెకు ఈ స్టూడెంట్ లగేజీ స్కీమ్ వర్తించదంటూ  అదనపు లగేజీ ఛార్జీల కింద 350 బ్రిటిష్ పౌండ్లు (రూ. 34,131) వసూలుచేయడంతో వివాదం మొదలైంది.

అకడమిక్ ప్రోగ్రామ్ (చదువు) కాలపరిమితి ముగిసినందువల్ల ఆమె ఈ పథకానికి అర్హురాలు కాదని మొదట ఎయిరిండియా వాదించి, క్లెయిమ్‌ను తిరస్కరించింది. అయినా మాగన్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.  తాను  నాలుగేళ్ల కోర్సును మూడేళ్లలోనే పూర్తి చేశానని, తన ప్రయాణం చదువు పూర్తి కావడానికి సంబంధించిందేనని వాదించింది. చివరికి ఎయిరిండియా  డబ్బులు చెల్లించేందుకు  అంగీకరించింది. కానీ దాన్ని చెల్లించడంలో విఫలం కావడంతో మరోసారి వినియోగరుదారుల కమిషన్‌ను ఆశ్రయించి విజయం సాధించింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement