టిఫిన్ బాక్స్‌లో గొడ్డు మాంసం.. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం | Beef In Tiffin Box Triggers Tension At Assam School, Five Students Face Expulsion, More Details Inside | Sakshi
Sakshi News home page

టిఫిన్ బాక్స్‌లో గొడ్డు మాంసం.. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం

Jun 9 2026 9:07 AM | Updated on Jun 9 2026 9:55 AM

Assam Tiffin Row 5 Students Face Expulsion Over Beef Controversy

గోల్‌పారా: అస్సాంలోని గోల్‌పారా జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో టిఫిన్ బాక్స్‌లో గొడ్డు మాంసం (బీఫ్) తీసుకువచ్చిన ఉదంతం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. క్లాస్‌మేట్స్‌కు ఈ ఆహారాన్ని తినిపించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ఐదుగురు ముస్లిం విద్యార్థులను పాఠశాల నుండి బహిష్కరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ ఘటన స్థానికంగా మతపరమైన వివాదంగా మారడంతో పోలీసులు, జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగాల్సి వచ్చింది.

తల్లి అరెస్ట్.. మైనర్ బాలుడి నిర్బంధం
కృష్ణాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు జూన్ 5వ తేదీన తమ టిఫిన్ బాక్స్‌లోని గొడ్డు మాంసాన్ని ఇద్దరు హిందూ సహచర విద్యార్థులకు తినిపించడానికి ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై హిందూ విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో, మతపరమైన నమ్మకాలను దెబ్బతీశారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే టిఫిన్ తెచ్చిన మైనర్ బాలుడిని జువైనల్ కోర్టులో ప్రవేశపెట్టగా, అతని తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నలుగురు బాలురను విచారిస్తున్నారు.

స్కూల్ మేనేజ్‌మెంట్ సంచలన నిర్ణయం
మొదట ఈ వివాదాన్ని పాఠశాల పరిధిలోనే పరిష్కరించాలని ఉపాధ్యాయులు భావించినప్పటికీ, విషయం గ్రామంలో తెలియడంతో స్థానిక సంస్థలు, ప్రజలు పాఠశాల వద్దకు భారీగా చేరుకుని నిరసనలు చేపట్టారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ఈ నేపథ్యంలో స్కూల్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు సుబ్రతా దాస్ మాట్లాడుతూ.. మంగళవారం జరిగే ప్రత్యేక సమావేశంలో ఆ ఐదుగురు విద్యార్థులను పాఠశాల నుండి శాశ్వతంగా బహిష్కరించే ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. మెజారిటీ సభ్యులు బహిష్కరణకే మొగ్గు చూపినట్లు ఆయన తెలిపారు.

మాంసాహారంపై నిషేధం విధించిన కలెక్టర్
ఈ ఘర్షణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రదీప్ తిముంగ్, ఎస్ఎస్పీ నవనీత్ మహంత పాఠశాలను సందర్శించి శాంతిభద్రతలను సమీక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు స్కూల్ టిఫిన్ బాక్సులను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థులు గరిష్టంగా కోడిగుడ్లు మాత్రమే తెచ్చుకోవచ్చని, చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహారాలను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇది కూడా చదవండి: యూసుఫ్ పఠాన్‌కు మహువా స్ట్రాంగ్ వార్నింగ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement