‘యువరాజు’ సెంచరీ: ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు | PM Modi says Assam set for NDA hat trick | Sakshi
Sakshi News home page

‘యువరాజు’ సెంచరీ: ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Apr 1 2026 1:39 PM | Updated on Apr 1 2026 1:53 PM

PM Modi says Assam set for NDA hat trick

గోగాముఖ్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల సమరంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార పర్వాన్ని హోరెత్తించారు. ‘ఈ ఎన్నికలు కేవలం విజయం కోసం కాదు వికసిత భారత్ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రజా తీర్పు’ అంటూ గోగాముఖ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన  పేర్కొన్నారు. అస్సాంలో ఎన్‌డీఏ కూటమి వరుసగా మూడోసారి జయకేతనం ఎగురవేసి, ఘనమైన ‘హ్యాట్రిక్’ నమోదు చేయడం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు
ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని ఘాటు విమర్శలు చేశారు. అస్సాం ప్రజలు ఆ పార్టీని మరోసారి తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికలతో ఎన్‌డీఏ హ్యాట్రిక్ విజయం సాధిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటములలో హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా, వారి ‘యువరాజు’ ఓటముల్లో సెంచరీని పూర్తి చేసుకోబోతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రకటన తర్వాత జరిగిన తన మొదటి సభకు భారీగా తరలివచ్చిన జనసందోహమే ఎన్‌డీఏ విజయానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
 

మేనిఫెస్టోలో వరాల జల్లు
అస్సాం అభివృద్ధి కోసం బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన కీలక హామీలను మోదీ ఈ సందర్భంగా వివరించారు. 15 లక్షల కుటుంబాలకు ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కింద పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థుల కోసం కేజీ నుంచి పీజీ  వరకు ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించారు. లఖ్‌పతి దీదీ పథకం ద్వారా ఇప్పటికే మూడు లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందారని, రానున్న కాలంలో ఈ సంఖ్యను 40 లక్షలకు విస్తరిస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. ‘అరుణోదయ’ పథకాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు.

ఏప్రిల్ 9న పోలింగ్
అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి. అస్సాం గణ పరిషత్ (ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్‌)లతో కలిసి బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. గత పదేళ్ల అభివృద్ధి మళ్లీ తమను అధికారంలోకి కూర్చోబెడుతుందని బీజేపీ భావిస్తుండగా, అధికారపక్షాన్ని గద్దె దించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. మోదీ పర్యటనతో అస్సాం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

ఇది కూడా చదవండి: Iran war : మృత్యు నీడలో భారత మత్స్యకారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement