సాక్షి, హైదరాబాద్: ఒంటి నిండా బంగారంతో సూర్య భాయ్‌గా సోషల్‌మీడియాలో పలు ఇంటర్వ్యూలు ఇచ్చి, కొన్ని సినిమాల్లోనూ నటించిన హైదరాబాదీ పల్లపు సురేష్ కుమార్ చెప్పినవన్నీ కేవలం బిల్డప్‌లేనని తేలిపోయింది. ఢిల్లీ విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) అధికారులు పట్టుకున్న ‘బంగారు బాబు’ కొండా విజయ్‌కుమార్ వ్యవహారంతో సూర్య భాయ్ కథ బయటికి వచ్చింది. శుక్రవారం విచారణ చేసిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు అతడు ధరించే బంగారు ఆభరణాల్లో అనేకం కోటింగ్‌తో కూడినవి స్పష్టం చేశారు. వీటి విలువ రూ.3 లక్షల వరకు ఉంటుందని తేల్చారు.
గుట్టు వీడిన కట్టుకథలు..
నగరంలోని అత్తాపూర్‌నకు చెందిన పల్లపు సురే‹Ùకుమార్ అలియాస్ సూర్య భాయ్ తాను ధరించే బంగారు ఆభరణాలు, యూట్యూబ్ చానళ్లతో పాటు ఇతర సోషల్‌మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూలతో అనేక మందిని సుపరిచితుడిగా మారాడు. తాను ధరించే నగల విలువ రూ.కోటి వరకు ఉంటుందనీ ప్రగల్భాలు పలికేవాడు. ఇప్పటి వరకు ఇతడి ప్రచారాన్ని అంతా నమ్మారు. గురువారం ఢిల్లీ విమానాశ్రయంలో మొదలైన ఓ కేసు విచారణ శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇతడు చెప్పేవన్నీ కట్టుకథలని, ధరించే వాటిలో అత్యధికం నకిలీ నగలని తేలిపోయింది.
సెటిల్‌మెంట్లతో వాహనాల కొనుగోలు
సూర్య భాయ్ గడిచిన ఆరేళ్లుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని గుర్తించారు. 2022–23లో రూ.4.9 లక్షల ఆదాయం ఉన్నట్లు చూపించారని తేల్చారు. అతడితో పాటు భార్య పేరు మీదా సొంద ఇంటితో సహా ఎలాంటి స్థిరాస్తులు లేవని, నెలకు రూ.20 వేల అద్దె చెల్లిస్తూ ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. అతడికి ఉన్న థార్, సఫారి, ఎండీవర్ వాహనాలతో పాటు బుల్లెట్ బైక్‌ను భూవివాదాలు సెటిల్‌మెంట్ చేయడం ద్వారా వచ్చిన కమీషన్‌తో కొనుగోలు చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. సూర్యభాయ్ ధరించే నగల విలువ రూ.3 లక్షలే అని తేల్చారు. అతను ధరించేవి ఎక్కువ భాగం రాగి, వెండితో తయారయ్యాయని, వాటి పైన బంగారం, రేడియం పూత పూసినట్లుతేల్చింది. ఐటీ అధికారుల విచారణలో సూర్య భాయ్ తాను సమాజంలో పాపులారిటీతో పాటు సినిమాల్లో అవకాశాలు పొందడానికి ఇలా చేశానని చెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారాలపై ఐటీ అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


