సాక్షి, న్యూఢిల్లీ: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ మృతి ప్రధానాంశంగా మారుతోంది. దీనిపై పారీ్టల పరస్పర ఆరోపణలు, దూషణలతో వాతావరణం వేడెక్కింది. ఈ అంశానికి కాంగ్రెస్ ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలోనే చోటిచి్చంది! తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోగా గార్గ్ మృతిపై నిజాలు వెలికితీసి న్యాయం చేస్తామని హామీ ఇచి్చంది. అస్సాంలో గార్గ్‌కు లక్షల్లో అభిమానులున్నారు. దాంతో వారి ఓట్ల కోసం పార్టీలన్నీ యథాశక్తి ప్రయత్నిస్తున్నాయి.
రాజకీయ దుమారం
52 ఏళ్ల జుబీన్ గార్గ్ 2025 సెపె్టంబర్ 19న సింగపూర్‌లో ఒక ద్వీపం వద్ద ఈత కొడుతూ మరణించారు. అది కాస్తా రాజకీయంగా వివాదాంశంగా మారింది. గార్గ్‌ను కుట్రలో భాగంగా హత్య చేశారని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. అది ప్రమాద మరణమేనని సింగపూర్ కోర్టు నిర్ధారించినా, ఆయనకు బలవంతంగా మద్యం తాగించారని హిమంత వాదించారు. దీనిపై విచారణకు సిట్ కూడా ఏర్పాటు చేశారు. గార్గ్ మేనేజర్, ఈవెంట్ నిర్వాహకుడు, ఇద్దరు బ్యాండ్ సభ్యులు సహా ఏడుగురు ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ ఉదంతాన్ని ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలచుకునేందుకు పారీ్టలన్నీ ప్రయత్నిస్తుండటం విశేషం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది.
ఎన్నికల మేనిఫెస్టోలో ఐదు ప్రధాన హామీలలో గార్గ్ కేసుకూ స్థానం కలి్పంచింది! గార్గ్ హత్య ఎలా జరిగింది, బాధ్యులెవరన్నది తాము అధికారంలోకి వచి్చన 100 రోజుల్లో వెలికి తీసి నిజానిజాలను ప్రజల ముందుంచుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. గార్గ్ కుటుంబానికి న్యాయం చేయలేకపోతే బీజేపీకి ఓటేయొద్దని హిమంత పలుమార్లు ప్రకటించడాన్ని పీసీసీ చీఫ్ గౌరవ్ గొగొయ్ ఎన్నికల ర్యాలీల్లో పదేపదే గుర్తు చేస్తున్నారు. విచారణలో విపరీత జాప్యం జరుగుతోందంటూ గార్గ్ భార్య గరిమ ప్రధానికి లేఖ రాయడాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. గార్గ్ మృతిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ మొదలవనుంది.
స్మారకం చుట్టూ నేతల చక్కర్లు
గువాహటి సమీపంలో నిర్మిస్తున్న గార్గ్ స్మారక కేంద్రం వద్ద నేతలు బారులు తీరుతున్నారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు రాష్ట్ర, జాతీయ నాయకులు నిత్యం పోటెత్తుతున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ వాద్రా మొదలుకుని ఆ పారీ్టకి చెందిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దాకా ఈ జాబితాలో ఉండటం విశేషం! ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతల రాక మరింత పెరిగింది. రాజకీయాలను ఆజన్మాంతం ద్వేషించిన జుబీన్ పేరు ఇప్పుడు రాజకీయంగా మారుమోగుతుండటం విచిత్రంగా ఉందంటూ ప్రజలు విస్తుపోతున్నారు!


