ప్రొఫైల్
అఖిల్ గొగోయ్. రైజోర్ దళ్ అధ్యక్షుడు. శివసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే. మార్క్సిస్ట్ విశ్వాసాలతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అస్సాం రైతులకు ఆశాకిరణంగా మారారు. భూ హక్కులు, పర్యావరణ పరిరక్షణ పోరాటాలతో వెలుగులోకి వచ్చి అవినీతి వ్యతిరేకోద్యమ నేతగా ఎదిగారు. అరెస్టులు, జైలు నిర్బంధాలను ఎదుర్కొన్నారు. జైలు నుంచే అసెంబ్లీకి ఎన్నికై చరిత్ర సృష్టించారు. ప్రచారమే చేయకుండా ఎన్నికల్లో గెలిచిన తొలి అస్సామీ నేతగా నిలిచారు.
వందకు పైగా కేసులు!
అఖిల్ రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశలోనే మొదలైంది. గువాహతిలోని కాటన్ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత సీపీఐ (ఎంఎల్) అనుబంధ సంస్థలో చేరినా కొంతకాలానికే బయటికొచ్చారు. ప్రభుత్వ అక్రమాలను బయటపెట్టడానికి సమాచార హక్కు చట్టాన్నే ఆయుధంగా చేసుకున్నారు. అటవీ భూముల ఆక్రమణ, పర్యావరణ సమస్యలపై పోరాటానికి ‘కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి’(కేఎంఎస్‌ఎస్)ని ఏర్పాటు అఖిల్ ఉద్యమ ప్రయాణంలో కీలక మలుపు.
ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, భూ హక్కుల కోసం, రైతులు, దినసరి కూలీల సమస్యలపై ఆందోళనలు చేపట్టారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం 2010లో అఖిల్‌ను అరెస్టు చేసినా కొంతకాలానికే నిర్దోషిగా విడుదలయ్యారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేకోద్యమంలోనూ పని చేశారు. 2012లో కొండ ప్రాంతాలవారిని బలవంతంగా ఖాళీ చేయించడాన్ని నిరసిస్తూ, కజిరంగా నేషనల్ ఆక్రమణలకు వ్యతిరేకంగా ఉద్యమించి పలుమార్లు అరెస్టయ్యారు. ఆయనపై 100కు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కదాంట్లోనూ ఆయన దోషిగా నిర్ధారణ కాలేదు.
వ్యక్తిగత జీవితం
అఖిల్ 1976 మార్చి 1న జోర్హాట్‌లోని సెలెన్‌ఘాట్ గ్రామంలో జని్మంచారు. గువాహటిలోని కాటన్ కాలేజీలో ఆంగ్ల సాహిత్యం అభ్యసించారు. ఆయన తండ్రి, బోలురామ్ తల్లి ప్రియదా గొగోయ్, భార్య గీతాశ్రీ తమూలీ, కుమారుడు నచికేత ఉన్నారు.
ఈసారి కాంగ్రెస్‌తో జట్టు
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా 2019 డిసెంబర్లో ఉద్యమించడంతో హిమంత సర్కారు అఖిల్‌పై దేశద్రోహ ఆరోపణలు మోపి జైలుకు పంపింది. దానిపై ప్రజాగ్రహం పెల్లుబికింది. కేఎంఎస్‌ఎస్ సహా సుమారు 70 అనుబంధ సంస్థలు కలిసి అఖిల్ సారథ్యంలో ‘రైజోర్ దళ్’గా మారాయి. జైల్లో ఉంటూనే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో శివసాగర్ స్థానం నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యరి్థపైనే దాదాపు 12 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు! తర్వాత నిర్దోషిగా విడుదలయ్యారు. అసెంబ్లీలో ప్రజల గొంతుకగా నిలుస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రైజోర్ దళ్ కాంగ్రెస్‌తో జట్టుకట్టింది. అఖిల్ పారీ్టకి కాంగ్రెస్ ఏకంగా 13 స్థానాలు కేటాయించింది! అఖిల్ మళ్లీ శివసాగర్ నుంచే బరిలో దిగారు. అక్కడ బీజేపీ భాగస్వామి అస్సాం గణ పరిషద్ కూడా స్నేహపూర్వక పోటీ చేస్తుండటం విశేషం.


