Iran war : మృత్యు నీడలో భారత మత్స్యకారులు | Tamil Nadu Fishermen Trapped in Irans War | Sakshi
Sakshi News home page

Iran war : మృత్యు నీడలో భారత మత్స్యకారులు

Apr 1 2026 12:32 PM | Updated on Apr 1 2026 12:42 PM

Tamil Nadu Fishermen Trapped in Irans War

కన్యాకుమారి/న్యూఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు, కన్యాకుమారికి చెందిన సుమారు 600 మంది మత్స్యకారుల జీవితాలను అంధకారంలోకి నెట్టివేశాయి. స్వదేశంలో నెలల తరబడి చెమటోడ్చినా దక్కని ఆదాయం, అక్కడ కేవలం పది రోజుల్లోనే చేతికి అందేది. ఆ ఆశే వారిని ఏడు సముద్రాలు దాటించి, ఇరాన్ తీరానికి చేర్చింది. అయితే నేడు అక్కడ పరిస్థితి తలకిందులైంది. ప్రస్తుతం ఈ మత్స్యకారులు ఇరాన్‌లోని బుషెహర్, దాని పరిసర తీర ప్రాంతాల్లో చిక్కుకుపోయారు.  

‘స్క్రోల్‌ ఇన్‌’కు ‘సౌత్ ఏషియన్ ఫిషర్‌మెన్ ఫ్రాటర్నిటీ’ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం గత ఫిబ్రవరిలో ఇరాన్ సర్వోన్నత నేత ఖమేనీ మరణించిన తర్వాత మొదలైన వైమానిక దాడులు, బాంబుల వర్షం.. ఇరాన్‌లోని మత్స్యకారుల జీవితాలను అతలాకుతలం చేశాయి. ప్రస్తుతం తిండి, నీరు, కనీస వైద్యం అందక పడవలపైనే కాలం వెళ్లదీస్తున్న వీరి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది.

ఒకే సిమ్ కార్డు.. 12 మంది వినియోగం
కన్యాకుమారిలోని మత్స్యకార కుటుంబానికి చెందిన షాజీ.. ఇరాన్‌లో చిక్కుకున్న భర్త రవికుమార్ నుంచి వచ్చే ఫోను కోసం నిత్యం ఎదురు చూస్తుంటుంది. ఇరాన్‌లో చిక్కుకున్న బాధితుల వద్ద కమ్యూనికేషన్ సౌకర్యాలు కూడా కరువయ్యాయి. రవికుమార్‌తో పాటు మరో 12 మంది కలిసి కేవలం ఒకే ఒక్క సిమ్ కార్డును వాడుతున్నారు. ‘బాంబుల శబ్దంతో నిద్ర పట్టడం లేదు.. ఆహారం నిండుకుంది’ అని వారు ఫోన్‌లో చెబుతుంటే ఇక్కడ కుటుంబ సభ్యుల కళ్లలో కన్నీళ్లు ఆగడం లేదు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఎటు నుంచి క్షిపణులు వస్తాయో తెలియని స్థితిలో మత్స్యకారులు కాలం వెళ్లదీస్తున్నారని  ‘సౌత్ ఏషియన్ ఫిషర్‌మెన్ ఫ్రాటర్నిటీ’ ప్రతినిధులు  తెలిపారు

అప్పుల ఊబిలో కుటుంబాలు
తమ వారిని క్షేమంగా తిరిగి భారత్‌ రప్పించేందుకు  ఇక్కడి మత్స్యకార కుటుంబాలు  ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నాయి. మేరీ రాజ్ అనే మహిళ తన 20 ఏళ్ల కుమారుని ఉపాధి కోసం తన ఒంటి మీద ఉన్న నగలను తాకట్టు పెట్టి, రూ.1.5 లక్షలు అప్పు చేసింది. విదేశాల్లో బాగా సంపాదిస్తారని అక్కడికి పంపిస్తే, ఇప్పుడు ప్రాణాలతో కుమారుడు వస్తే చాలని మేరా రాజ్‌ దేవుడిని వేడుకుంటోంది.

అక్కడి సౌకర్యాలే శాపమయ్యాయా?
భారతదేశంలో చేపల వేట తగ్గిపోవడం, మౌలిక సదుపాయాల కొరత ఉండటంతో మత్స్యకారులు ఇరాన్ వైపు మొగ్గు చూపుతుంటారు. ఇరాన్‌లో అనారోగ్యానికి గురైతే హెలికాప్టర్లు పంపే స్థాయి సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు యుద్ధం కారణంగా అక్కడి యజమానులు కూడా చేతులెత్తేస్తున్నారు. మత్స్యకారుల పాస్‌పోర్టులు యజమానుల వద్దే ఉండటం, భాష తెలియకపోవడం వారిని మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సంపాదన ఆశ చూపి తీసుకెళ్లిన యజమానులు ఇప్పుడు భద్రతకు గ్యారెంటీ ఇవ్వలేమని స్పష్టం చేయడంతో వారి భవిష్యత్తు అంధకారంలో పడింది.

ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన
యుద్ధ ప్రాంతం నుంచి విద్యార్థులను తరలించిన కేంద్ర ప్రభుత్వం, సముద్రం మధ్యలో చిక్కుకున్న మత్స్యకారుల విషయంలో అలసత్వం వహిస్తోందని బాధితుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల కోలాహలంలో ఉన్న అధికారులు, ఈ నిరుపేద మత్స్యకారుల గోడును పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. బాంబుల మోత మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న తమ వారిని కాపాడాలని కన్యాకుమారి తీర ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 

ఇది కూడా చదవండి: మహువా వ్యాఖ్యల కలకలం.. రంగంలోకి మమత

Advertisement
 
Advertisement
Advertisement