డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, ఆ డబ్బును సరైన విధంగా పొదుపు చేయకపోతే భవిష్యత్తులో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి 70/10/10/10 ఫార్ములా ప్రకారం.. మీరు డబ్బును ఖర్చు చేస్తే.. తప్పకుండా ఆర్ధిక ఇబ్బందుల నుంచి భయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫార్ములా గురించి మరిన్ని వివరాలు వివరంగా..
ఏమిటీ 70/10/10/10 ఫార్ములా
మీరు సంపాదించే డబ్బు లేదా నెలవారీ సంపాదనను నాలుగు భాగాలుగా విభజించుకోవాలి. ఎంత డబ్బు దేనికి ఖర్చు చేయాలనే విషయాన్ని ముంచుగానే ఊహించాలి. అప్పుడే.. నెల చివరలో కూడా డబ్బు కోసం ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు.
70 శాతం: మీ నెల జీతంలో 70 శాతం డబ్బును.. ఇంటి అద్దె, నిత్యావసర వస్తువుల కోసం, ప్రయాణ ఖర్చులకు, పిల్లల ఖర్చులు, బీమా వంటి వాటికోసం కేటాయించాలి. అంటే.. ప్రస్తుత జీవన విధానం కోసం ఆ డబ్బును వెచ్చించాలన్నమాట.
10 శాతం: మీ నెల జీతంలో 10 శాతాన్ని పొదుపు (సేవింగ్స్) చేయడానికి కేటాయించాలి. అంటే మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించాలన్నమాట. ఎందుకంటే.. భవిష్యత్తు కోసం కూడా తప్పకుండా కొంత డబ్బు పొదుపు చేయాల్సిందే.
10 శాతం: మీ నెల సంపాదనలో మరో 10 శాతం.. అత్యవసర నిధి మాదిరిగా.. అంటే ఎమర్జెన్సీ సమయంలో ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు. ప్రయాణాలు చేయడానికి, ఆకస్మిక వైద్యం కోసం.. కొన్ని గృహోపకరణాల కోసం కూడా దీనిని కేటాయించుకోవచ్చన్నమాట.
10 శాతం: మిగిలిన 10 శాతం.. ఈఎంఐ, లేదా అప్పులు వంటివి చెల్లించడానికి ఉపయోగించుకోవచ్చు. ఒకవేలా అప్పు లేదా ఈఎంఐ లేకపోతే.. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, విదేశీ విద్య కోసం కూడా ఉపయోగించుకోవచ్చన్నమాట.
మీ జీతం నెలకు లక్ష రూపాయలు అనుకుంటే.. అందులో రూ. 70వేలు (70 శాతం) ఇంటి అద్దె మొదలైనవాటికి, మిగిలిన 30 శాతాన్ని ఫార్ములా ప్రకారం కేటాయించుకోవాలి. ఈ ఫార్ములా మీరు పాటిస్తే.. ఉన్న డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో స్పష్టంగా అర్థమవుతుంది.


