వైభవ్ సూర్యవంశీతో జైస్వాల్ (PC: RR/IPL)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొట్టమొదటి సీజన్ విజేతగా రాజస్తాన్ రాయల్స్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 2008లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడిన రాజస్తాన్.. ఆ తర్వాత జైపూర్‌లోని సొంత మైదానం సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం(SMS)లో తదుపరి మ్యాచ్ ఆడింది.
సుదీర్ఘ బంధానికి వీడ్కోలు
క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి ఈ మైదానాన్ని తమ హోం గ్రౌండ్‌గా ఎంచుకున్న రాజస్తాన్ జట్టు.. ఇప్పుడు ఈ సుదీర్ఘ బంధానికి వీడ్కోలు పలికేందుకు సిద్ధమైంది. రెవ్‌స్పోర్ట్స్ కథనం ప్రకారం.. ఐపీఎల్-2026 సీజన్ నుంచి రాజస్తాన్ రాయల్స్ హోం గ్రౌండ్ మారనుంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియాన్ని తమ సొంత మైదానంగా రాయల్స్ ఎంచుకుంది.
కారణం ఇదే
జైపూర్‌లోని ‘SMS’ గ్రౌండ్‌లో భద్రతా ప్రమాణాలు సరిగ్గా లేవని ఇప్పటికే రాయల్స్ యాజమాన్యం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ విషయంలో వారి నుంచి సరైన స్పందన కరువైంది. ఈ సమస్యలు ఎప్పటికి పరిష్కారమవుతాయన్న అంశంపై కూడా సదరు అధికార వర్గాలు కచ్చితమైన సమాచారం ఇవ్వలేదట. దీంతో రాయల్స్ తమ హోం గ్రౌండ్ మార్పు గురించి తుదినిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
పుణెలో
ఇప్పటికే రాయల్స్ ఆపరేషన్ టీమ్ పుణెకి వెళ్లి.. అక్కడి పిచ్ పరిస్థితులు, సీటింగ్ సామర్థ్యం, ఆటగాళ్ల సౌకర్యాలు, మంచి హోటళ్లు అందుబాటులో ఉన్నాయా? లేవా?, రవాణా తదితర అంశాల గురించి పరిశీలించినట్లు సమాచారం. ఈ క్రమంలో పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియాన్ని (MCA) హోం గ్రౌండ్‌గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రెండో హోం గ్రౌండ్‌గా అసోంలోని గువాహటి యథావిధిగా కొనసాగనుంది.
కాగా MCA స్టేడియంలో గతం (2016-17)లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కు సొంత మైదానంగా ఉండేది. ఇక చెన్నూ సూపర్ కింగ్స్ 2018లో తమ తాత్కాలిక సొంత మైదానంగా MCAను ఎంచుకుంది.
ఆర్సీబీని ఓడించి..
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది రాయల్స్‌తో పాటు ఆర్సీబీ కూడా ఈ మైదానం కోసం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే, చివరగా రాయల్స్‌కే ఇది హోం గ్రౌండ్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే SMSలో ఇన్నాళ్లు రాయల్స్ మ్యాచ్ వీక్షించిన స్థానిక ‘ఫ్యాన్స్’కు భారీ షాక్ తగిలినట్లే!!
ఇక 2008లో విజేతగా నిలిచిన రాయల్స్.. మళ్లీ ఫైనల్ చేరడానికి దాదాపు పద్నాలుగేళ్లు పట్టింది. సంజూ శాంసన్ కెప్టెన్సీలో 2022లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక 2026 వేలానికి ముందే సంజూ శాంసన్‌ను చెన్నైకి ట్రేడ్ చేసిన రాయల్స్ యాజమాన్యం.. రవీంద్ర జడేజాను తమ జట్టులో చేర్చుకుంది. ఇంతవరకు తమ కెప్టెన్‌ను మాత్రం ప్రకటించలేదు.
చదవండి: KKR: అతడొక ద్రోహి.. కేకేఆర్ ఇలాంటి పనిచేస్తుందా?.. బీసీసీఐ స్పందన ఇదే


