జమ్మూకశ్మీర్‌ కొత్త చరిత్ర | Jammu and Kashmir team qualifies for Ranji Trophy final for the first time | Sakshi
Sakshi News home page

జమ్మూకశ్మీర్‌ కొత్త చరిత్ర

Feb 19 2026 3:57 AM | Updated on Feb 19 2026 3:57 AM

Jammu and Kashmir team qualifies for Ranji Trophy final for the first time

తొలిసారి రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు అర్హత 

సెమీఫైనల్లో బెంగాల్‌పై విజయం  

కల్యాణి (పశ్చిమ బెంగాల్‌): సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. రంజీ ట్రోఫీలో అడుగు పెట్టిన 67 ఏళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ జట్టు తొలిసారి ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీలో టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. రెండుసార్లు చాంపియన్‌ బెంగాల్‌ జట్టుతో నాలుగు రోజుల్లో ముగిసిన సెమీఫైనల్లో పారస్‌ డోగ్రా సారథ్యంలోని జమ్మూకశ్మీర్‌ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. బెంగాల్‌ నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్‌ స్కోరు 43/2తో నాలుగో రోజు జమ్మూకశ్మీర్‌ రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించింది. 

21.4 ఓవర్లు ఆడి రెండు వికెట్లు కోల్పోయి 83పరుగులు సాధించి జమ్మూకశ్మీర్‌ విజయఢంకా మోగించింది. శుభమ్‌ పుందిర్‌ (27), పారస్‌ డోగ్రా (9) పెవిలియన్‌ చేరుకున్నా... వన్షజ్‌ శర్మ (83 బంతుల్లో 43 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), అబ్దుల్‌ సమద్‌ (27 బంతుల్లో 30 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) జమ్మూకశ్మీర్‌ జట్టును విజయతీరాలకు చేర్చారు. తొమ్మిది వికెట్లు తీయడంతోపాటు 42 పరుగులు చేసిన జమ్మూకశ్మీర్‌ ఆటగాడు ఆకిబ్‌ నబీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారంతోపాటు రూ. 50 వేలు ప్రైజ్‌మనీ దక్కింది.  

బెంగాల్‌ తొలి  ఇన్నింగ్స్‌లో 328 పరుగులు... జమ్మూకశ్మీర్‌ 302 పరుగులు చేశాయి. బెంగాల్‌ రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగులకు ఆలౌటైంది. కర్ణాటక, ఉత్తరాఖండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్‌ విజేత జట్టుతో ఈనెల 24 నుంచి హుబ్లీ వేదికగా జరిగే రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూకశ్మీర్‌ జట్టు తలపడుతుంది.  

802 పరుగుల ఆధిక్యంలో కర్ణాటక 
లక్నోలో ఉత్తరాఖండ్‌ జట్టుతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో కర్ణాటక జట్టు 802 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 149/5తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఉత్తరాఖండ్‌ జట్టు 88.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. కర్ణాటక బౌలర్లలో విద్యాధర్‌ పాటిల్, విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ మూడు వికెట్ల చొప్పున తీశారు. 503 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం పొందిన కర్ణాటక ప్రత్యర్థి జట్టుకు ఫాలోఆన్‌ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్‌ ఆడాలని నిర్ణయం తీసుకుంది. 

ఆట ముగిసే సమయానికి కర్ణాటక రెండో ఇన్నింగ్స్‌లో 63.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 299 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రవిచంద్రన్‌ స్మరణ్‌ (127; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం సాధించడం విశేషం. కేఎల్‌ రాహుల్‌ (70 బ్యాటింగ్‌; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), కృతిక్‌ కృష్ణ (52; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆధారంగా కర్ణాటక జట్టు ఫైనల్‌ చేరుకుంటుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement