పూణే: ప్రముఖ రాజకీయ నేత, మాజీ కేంద్ర మంత్రి సురేష్ కల్మాడీ (81) నేడు (మంగళవారం) తుదిశ్వాస విడిచారు. పూణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. గత కొంతకాలంగా ఆయన వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
సురేష్ కల్మాడీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఎరందవనేలోని ఆయన నివాసం ‘కల్మాడీ హౌస్’లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంచనున్నారు. అభిమానులు, రాజకీయ నేతలు ఆయనకు నివాళులు అర్పించేందుకు భారీగా తరలిరానున్నారని సమాచారం. మధ్యాహ్నం 3:30 గంటలకు పూణే నవీ పేటలోని వైకుంఠ స్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది.
భారత రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేతగా కల్మాడీ సుదీర్ఘ కాలం పనిచేశారు. 1995-96 మధ్య కాలంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. రాజకీయాల్లోకి ప్రవేశించకముందు ఆయన భారత వైమానిక దళంలో (ఐఎఎఫ్) పైలట్‌గా 1964 నుండి 1972 వరకు పనిచేశారు. క్రీడా రంగంలో భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధ్యక్షునిగా దేశీయ క్రీడా రంగంలో కీలక పాత్ర పోషించారు. భారత క్రీడా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఎనలేని కృషి చేశారు.
2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు కల్మాడీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పాయి. ఈ కేసులో 2011లో ఆయన అరెస్ట్ కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. అనంతరం 2016లో ఆయనను ఐఓఏ జీవితకాల అధ్యక్షుడిగా నియమించినప్పటికీ, తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ పదవిని తిరస్కరించారు.
Pune, Maharashtra | Former Union Minister and Senior Congress leader Suresh Kalmadi passed away after a prolonged illness. He was admitted in Deenanath Mangeshkar hospital in Pune. His mortal remains will be kept at Kalmadi House, Erandwane, Pune till 2 pm and cremation will take…
— ANI (@ANI) January 6, 2026


