వైట్‌హౌస్ సమీపంలో అఫ్గాన్ యువకుడి కాల్పులు
ఇద్దరు వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డు జవాన్లకు గాయాలు
ఎదురు కాల్పుల్లో గాయపడి ప్రాణాలతో చిక్కిన నిందితుడు
ఇది ముమ్మాటికీ ఉగ్రవాద దాడేనన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
అమెరికాలోని అఫ్గాన్ జాతీయులపై విచారణ జరపాలని ఆదేశం
అఫ్గాన్ పౌరుల ఇమిగ్రేషన్ దరఖాస్తులను రద్దు చేయాలని స్పష్టీకరణ
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అధ్యక్షుడి అధికారిక నివాస భవనం వైట్‌హౌస్ సమీపంలోనే కాల్పుల మోత మోగింది. అమెరికాకు వలసవచ్చిన అఫ్గానిస్తాన్ యువకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డు జవాన్లు సారా బెక్‌్రస్టామ్(20), ఆండ్రూ వూల్ఫ్(24) తీవ్రంగా గాయపడ్డారు. జవాన్లలో ఒకరు జరిపిన ఎదురు కాల్పుల్లో సదరు యువకుడు సైతం గాయాలపాలయ్యాడు. అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రతిఏటా శ్వేతసౌధంలో ఘనంగా నిర్వహించే కృతజ్ఞతార్పణ దినానికి ముందురోజే కాల్పులు జరగడం, ఇద్దరు జవాన్లు క్షతగాత్రులుగా మారడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటన పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ ఉగ్రవాద దాడేనని తేల్చిచెప్పారు. జో బైడెన్ హయాంలో అమెరికాకు వలసవచ్చిన అఫ్గాన్ జాతీయుల కార్యకలాపాలపై విచారణ జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అఫ్గాన్ పౌరుల ఇమిగ్రేషన్ దరఖాస్తులను వెంటనే రద్దు చేయాలని తేల్చిచెప్పారు. ఇది మొత్తం అమెరికాకు వ్యతిరేకంగా జరిగిన నేరంగానే భావిస్తున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు. తమ దేశాన్ని ప్రేమించనివారు తమకు ఎంతమాత్రం అవసరం లేదని స్పష్టంచేశారు.
అసలేం జరిగింది?
శ్వేతసౌధంలో జరిగే ‘థ్యాంక్స్ గివింగ్ డే’ కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రంప్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జనం నిరసన వ్యక్తంచేసే అవకాశం ఉందన్న అనుమానంతో ముందు జాగ్రత్త చర్యగా ఇతర రాష్ట్రాల నుంచి నేషనల్ గార్డు సిబ్బందిని రప్పించారు. శ్వేతసౌధం చుట్టుపక్కల మోహరించారు. ఇక్కడికి సమీపంలోనే మెట్రో స్టేషన్ వద్ద బుధవారం మధ్యాహ్నం విధి నిర్వహణలో ఉన్న వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డు సిబ్బందిపై ఓ యువకుడు పాయింట్ 357 స్మిత్ అండ్ వెసన్ రివాల్వర్‌తో హఠాత్తుగా కాల్పులు జరిపాడు. మొత్తం ముగ్గురు జవాన్లపై కాల్పులు జరిగాయి. ఇద్దరు తీవ్రంగా గాయపడగా, మరో జవాను స్వల్పంగా గాయపడ్డాడు. అతడు వెంటనే స్పందించి, అఫ్గాన్ యువకుడిపై ఎదురు కాల్పులు ప్రారంభించాడు. తీవ్రస్థాయిలో గాయాలపాలైన ఇద్దరు జవాన్లను ఆసుపత్రికి తరలించారు. ఎదురు కాల్పుల్లో గాయపడిన అఫ్గాన్ యువకుడు భద్రతా సిబ్బంది చేతికి ప్రాణాలతో చిక్కాడు. అతడిని రహ్మనుల్లా లఖన్‌వాలా(29)గా గుర్తించారు.
అనుమానాలు ఎన్నెన్నో..
ఇటీవలి కాలంలో భారత్, అఫ్గానిస్తాన్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. తాలిబన్ పాలకులు భారత్‌కు స్నేహహస్తం అందిస్తున్నారు. కలిసి పనిచేస్తామని చెబుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం, తాలిబన్ పాలకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అఫ్గాన్–పాక్ సరిహద్దుల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అఫ్గాన్ యువకుడు అమెరికాలో కాల్పులు జరపడం, అధ్యక్షుడు ట్రంప్ అఫ్గానిస్తాన్‌పై కత్తి నూరుతుండడం చర్చనీయాంశంగా మారింది.
తమను అప్రతిష్టపాలు చేయడానికి పాక్ ప్రభుత్వం కుట్రలు సాగిస్తోందని, వాషింగ్టన్ డీసీలో జరిగిన కాల్పులతో తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్లు తేల్చిచెప్పారు. ఈ ఘటన వెనుక పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా, డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో తన వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాల కోసం పాకిస్తాన్‌ను బాగా ముద్దు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి విషయంలోనూ ఆయన పాకిస్తాన్‌ను వెనకేసుకొస్తున్నారు. పాక్ ప్రత్యర్థి అయిన అఫ్గానిస్తాన్‌పై మళ్లీ దాడులకు ట్రంప్ కసరత్తు చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. తాజా కాల్పుల ఘటనను సాకుగా చూపించి, అఫ్గాన్‌పై పెద్ద ఎత్తున విరుచుకుపడినా ఆశ్చర్యంలేదని నిపుణులు అంటున్నారు.
ఎవరీ రహ్మనుల్లా?
రహ్మనుల్లా లఖన్‌వాలా అఫ్గానిస్తాన్ జాతీయుడు. అక్కడే పుట్టిపెరిగాడు. 2021లో జో బైడెన్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక కారుణ్య పథకం కింద తన కుటుంబంతో కలిసి అమెరికాకు చేరుకున్నాడు. అప్పట్లో అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్ నుంచి ఉపసంహరించుకుంది. స్వదేశానికి తిరిగివచ్చింది. తాలిబన్ల కారణంగా తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ వేలాది మంది అఫ్గాన్లు కూడా శరణార్థుల రూపంలో అమెరికా చేరారు. జో బైడెన్ ప్రభుత్వం వారిని స్వాగతించింది. ఆ సమయంలో దాదాపు 76,000 మంది అఫ్గాన్ పౌరులు అమెరికాకు వలసవచ్చినట్లు అంచనా. వీరంతా వేర్వరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కొందరు అమెరికా సైన్యంలోనే అనువాదకులుగా పనిచేస్తున్నారు. రహ్మనుల్లా తన భార్య, ఐదుగురు సంతానంతో కలిసి వాషింగ్టన్ రాష్ట్రంలోని బెల్లింగ్‌హమ్ అనే ప్రాంతంలో స్థిరపడినట్లు తెలుస్తోంది. అతడు రాజధానికి వచ్చి, జవాన్లపై ఎందుకు కాల్పులు జరిపాడన్నది అంతుబట్టడం లేదు.


