హాంకాంగ్ అగ్నిప్రమాద ఘటనలో 83కు పెరిగిన మృతుల సంఖ్య
ఇంకా 300 మంది జాడ గల్లంతు
ఏడింట నాలుగు భవనాల్లో అదుపులోకి వచ్చిన మంటలు
మసిబొగ్గులా మారిన భవనాలు
సర్వం కోల్పోయి నిలువనీడలేక అపార్ట్‌మెంట్‌వాసుల రోదనలు
హాంకాంగ్/బీజింగ్: హాంకాంగ్‌లో గత 100 సంవత్సరాల చరిత్రలో అతిపెద్ద అగ్నిప్రమాదంగా పరిణమించిన వాంగ్ ఫుక్ కోర్ట్ హౌసింగ్ కాంప్లెక్స్ ఘటనలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిలువెత్తు నిప్పుకణికగా తయారైన బహుళఅంతస్తుల భవనాల్లో ఇంకా మంటలు చెలరేగడంతో మరికొందరు అపార్ట్‌మెంట్‌వాసులు అగ్నికి ఆహుతయ్యారు. గురువారంనాటికి మరణాల సంఖ్య 83కు పెరిగింది. వీరిలో ఇండోనేసియా వలసకార్మికులు సైతం ఉన్నారు.
76 మంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. వీరిలో 15 మంది ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. భవనాల్లో చిక్కుకుపోయిన దాదాపు 300 మంది జాడ తెలియాల్సి ఉందని హాంకాంగ్ స్థానిక యంత్రాంగం గురువారం ప్రకటించింది. పైఅంతస్తుల్లోకి మంటలు ఇంకా విస్తరిస్తూ, అగ్ని కీలలు ఎగసిపడుతుండటంతో వాటిని అదుపుచేయడం అగ్నిమాపక దళాలకు చాలా కష్టంగా మారింది.
ఎనిమిది భవనాల సమాహారంగా నిర్మితమైన వాంగ్‌ఫుక్‌కోర్ట్‌లో ఏడింటికి నిప్పు అంటుకోగా నాలుగు భవనాల్లో మంటలను అదుపులోకి తెచ్చారు. మిగతా మూడు భవనాల్లో పరిస్థితి అదుపులోలేదు. ఒక్కోటి 32 అంతస్తుల ఎత్తుండటంతో ఆ ఎత్తులోకి వెళ్లి మంటల్ని ఆర్పడం అసాధ్యంగా మారింది. 304 ఫైర్‌ఇంజిన్లు, వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, పారామెడికల్ సిబ్బంది, వలంటీర్లు అన్వేషణ, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
మసిబొగ్గులా మారిన ఒక్కో అపార్ట్‌మెంట్‌లోకి అగ్నిమాపక సిబ్బంది టార్చ్‌లైట్లు పట్టుకుని వెళ్లి మృతదేహాల కోసం వెతుకుతున్నారు. భవనాల ఆధునీకరణ బాధ్యతలు చూస్తున్న ఒక కాంట్రాక్టర్‌కు చెందిన ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌ను, ఇద్దరు డైరెక్టర్లను నిర్లక్ష్యానికి కారకులంటూ పోలీసులు గురువారం అరెస్ట్‌చేశారు. ‘‘ మంటలు ఎగసినప్పుడు నేను భవనంలో లేను. వెంటనే భార్యకు ఫోన్‌చేసి తప్పించుకో అని హెచ్చరించా.
ఫ్లాట్ నుంచి బయటికొస్తే మెట్ల వద్ద, కారిడార్‌లో మొత్తం మంటలే ఉన్నాయి. దీంతో మళ్లీ ఆమె ఫ్లాట్‌లోకి పరుగులుతీసింది. తర్వాత ఆమె ఏమైందో తెలీడం లేదు’’ అని అపార్ట్‌మెంట్‌వాసి లారెన్స్‌లీ బోరున విలపించారు. ‘‘ మంటలంటుకోగానే ఇంట్లోంచి బయటికొచ్చాం. ఇప్పుడు మా ఫ్లాట్ ఎలాగుందో. నిద్రలేని రాత్రిని గడిపాం’’ అని 75 ఏళ్ల వృద్ధదంపతులు వింటర్, శాండీ చంగ్ కన్నీరుమున్నీరయ్యారు.
అగ్గిరాజేసిన స్టీరోఫోమ్ కిటికీలు
భవనాలకు ఆవలివైపు నుంచి దాదాపు రూ.379 కోట్లతో గత కొన్ని నెలలుగా మరమ్మత్తులు, ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. దుమ్ము, ధూళి, నిర్మాణసంబంధ పరికరాలు, శబ్దాల నుంచి రక్షణ కోసం దాదాపు ప్రతి అపార్ట్‌మెంట్ కిటికీలకు రక్షణగా స్టీరోఫోమ్‌తో చేసిన ఫ్రేమ్‌లను బిగించారు. అయితే వీటికి అత్యంత వేగంగా మండే స్వభావం ఉంది.
వెదురుకర్రల చుట్టూతా కప్పిన ఆకుపచ్చ మెష్‌కు తొలుత మంటలు అంటుకుని, అవి వెనువెంటనే వెదురు కర్రలకు అంటుకున్నాయి. బహిరంగంగా ఉండటంతోపాటు ఎత్తయిన ప్రదేశంకావడంతో గాలులు తోడై ఆ మంటలు వెంటనే స్టీరోఫోమ్ కిటికీ ఫ్రేమ్‌లకు అంటుకోవడంతో అగ్నికీలలు అమాంతం ఎగసిపడి భారీ అగ్నిప్రమాదం సంభవించిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు.
40 శాతం మంది వృద్ధులే..
బాధితులకు తక్షణ సాయం అందించేందుకు హాంకాంగ్ ప్రభుత్వం రూ.385 కోట్లతో సహాయక నిధిని ఏర్పాటుచేసింది. వందలాది మంది అపార్ట్‌మెంట్‌వాసులను అధికారులు హుటాహుటిన తాత్కాలిక శిబిరాలకు తరలించి నిత్యావసర సరకులు అందిస్తున్నారు. ఈ హౌసింగ్ కాంప్లెక్స్‌ను 1,984 ఫ్లాట్‌లతో 1983 సంవత్సరంలో నిర్మించారు. 2021 జనాభా లెక్కల ప్రకారం వీటిల్లో దాదాపు 4,600 మంది నివసిస్తున్నారు. అపార్ట్‌మెంట్ జనాభాలో దాదాపు 40 శాతం మంది 65ఏళ్లు పైబడిన వృద్ధులేనని స్పష్టమవుతోంది.
పనిచేయని అలారమ్‌వ్యవస్థ
భవనాలు రిపేర్‌లో ఉండటంతో అలారమ్ వ్యవస్థలను పనిచేయకుండాచేశారని, అందుకే అగ్నిప్రమాదం వేళ ఎలాంటి అలారమ్ శబ్దాలు రాలేదని అపార్ట్‌మెంట్‌వాసులు చెప్పారు. తోటి అపార్ట్‌మెంట్ వాసుల ఇళ్లకు వెళ్లి బెల్ కొట్టడం, డబడబ అంటూ తలుపుతట్టడం, వాళ్లను అప్రమత్తంచేయడం, మళ్లీ మరో ఇంటికి వెళ్లడం ఇవే దృశ్యాలు అక్కడ కనిపించాయని మరో స్థానికుడు చెప్పారు. ప్రభావిత ఒక్కో అపార్ట్‌మెంట్‌వాసులకు తక్షణ సాయంగా రూ.1,14,000 ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.
మృతులకు నివాళులరి్పస్తూ పోప్ లియో గురువారం హాంకాంగ్ బిషప్‌కు సంతాప సందేశలేఖను పంపించారు. మృతులకు అమెరికా, బ్రిటన్‌సహా పలు దేశాలు సంతాపసందేశాలు పంపాయి. ఘటనపై నేరం కోణం పోలీసులు, నిర్లక్ష్యం కోణంలో హౌసింగ్ బ్యూరో, అవినీతి కోణంలో అవినీతినిరోధక శాఖలు వేర్వేరుగా దర్యాప్తు ప్రారంభించాయి.


