సాక్షి హైదరాబాద్: సిగాచీ పేలుళ్ల ఘటనలో పోలీసుల దర్యాప్తు తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఇది సాధారణ ఘటన కాదని 54 మంది కార్మికులు సజీవ దహానమైన భారీ ప్రమాదమని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్ అన్నారు. ఇంత తీవ్రమైన ప్రమాద ఘటనలో ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పడమేంటని ఏఏజీ తేరా రజినీకాంత్ రెడ్డిని ప్రశ్నించారు.
సంగారెడ్డిలో సిగాచీ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో దర్యాప్తు జరుగుతున్న తీరుపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. 54 మంది కార్మికులు మృతిచెందితే ఇంకా దర్యాప్తు జరుగుతుంది అని చెప్పడమేంటని ఏఏజీ తేరా రజనీకాంత్ రెడ్డిని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. ఇంత పెద్దఘటనకు డీఎస్పీని ఎందుకు దర్యాప్తు అధికారిగా నియమించారని అడిగారు. దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాల్సి ఉండవచ్చుగా అని ప్రశ్నించారు. 237మంది సాక్షులను విచారించినా ఇప్పటి వరకూ కేసులో ఎలాంటి పురోగతి లేదా అని అడిగారు.
సిగాచీ ప్రమాద ఘటనపై బాబురావు అనే వ్యక్తి ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. పేలుడు సంబవించి ఐదు నెలలు దాటినా ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిపుణుల కమిటీ సైతం పరిశ్రమ నిర్వహణలో లోపాలున్నాయని తేల్చింది. నిబంధనలకు విరుద్ధంగా 17 టన్నుల సోడియం క్లోరైడ్ నిల్వచేశారని కమిటీ గుర్తించిందని న్యాయవాది పేర్కొన్నారు. పేలుడు తీవ్రతతో ఎనిమిది మంది శరీరాలు ఆనవాళ్లు లేకుండా కాలిపోయాయని కోర్టుకు తెలిపారు.
వాదనలు విన్న కోర్టు పోలీసు దర్యాప్తు నివేదిక కోర్టుకు సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ తొమ్మిదికి వాయిదా వేసింది. ఆ విచారణకు డీఎస్పీ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. సంగారెడ్డి జిల్లా పాశామైలారంలోని సిగాచీ ఫార్మా ప్లాంట్ లో ఈ ఏడాది జూన్ 30 న భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 54 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు.


