పెద్దపల్లి జిల్లా: ‘మమ్మీ, డాడీ నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయారు. మమ్మీ.. పరీక్షలు దగ్గరపడుతున్నాయి మంచిగా చదువుకో అన్నావు.. డాడీ.. ఎంత ఖర్చయినా నీకు ఇష్టమున్న కాలేజీలో చదివిస్తానన్నావు.. పొద్దున్నే స్కూల్ టైం అవుతుంది.. తొందరగా రెడీ అవ్వు అని అల్లారుముద్దుగా బడికి పంపిస్తిరి.. ఇప్పుడు నాకు దిక్కెవ్వరు.. మీ ప్రేమ ఎవరి నుంచి దొరుకుతుంది.. నేను ఎందుకోసం చదవాలి.. నా మంచిచెడు ఎవరితో చెప్పుకోవాలి’ అంటూ ఆ కూతురు రోదన వర్ణనాతీతం.
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన కందుల తిరుపతి–స్రవంతి దంపతులు. అన్యోన్యంగా ఆర్థిక పొదుపు పాటిస్తూ ఆదర్శంగా జీవించారు. వీరి కూతురు శివాణి ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. మూడేళ్ల క్రితం మేడిపల్లి ఓపెన్‌కాస్టు మూతపడడంతో క్రమంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో తిరుపతి ఏదో ఓ పని చేసుకుంటూ, స్రవంతి కుట్టుమిషన్‌తో ఎంతో కొంత సంపాదిస్తూ ఆనందంగా ఉన్నారు. ఈనెల 7న దంపతుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. క్షణికావేశంలో భార్య బాత్రూమ్‌లోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకోగా, భర్త మంటలు ఆర్పే ప్రయత్నంలో ఇద్దరూ 70శాతం కాలిపోయారు. స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, ఈనెల 8న తిరుపతి, 10న స్రవంతి మృతిచెందారు.
చివరిచూపునకు నోచుకోక..
క్షణికావేశానికి తల్లిదండ్రులు బలి కాగా, కూతురు రోదనలు మిన్నంటాయి. ‘మమ్మీ.. డాడీ’ అని ఎవరిని పిలవాలంటూ శివాణి రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. తండ్రి చనిపోయిన విషయం తల్లికి తెలియదు.. తండ్రి అంత్యక్రియలు పూర్తవగానే తల్లి మరణం.. మళ్లీ తల్లికి అంత్యక్రియలు చేయడం.. మూడురోజులుగా ఆ కూతురు గుండెలవిసేల రోదించింది. పగోడికైనా ఇంతటి కష్టం రావద్దంటూ గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. తల్లి స్రవంతి శరీరం పూర్తిగా కాలిపోవడంతో మృతదేహాన్ని ప్యాక్ చేసి పంపించగా, కనీసం కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నానంటూ శివాణి వెక్కివెక్కి ఏడ్వడం గుండెలను పిండేసింది.


