కాకాణిని లాగేస్తున్న నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు
వేకువజాము నుంచే వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లను చుట్టుముట్టిన పోలీసులు
మాజీ మంత్రులు కాకాణి, నల్లపరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి హౌస్ అరెస్ట్
ప్రాజెక్టు వద్దకు వెళ్తే శాంతిభద్రతల సమస్య అంటూ నోటీసులు
పొదలకూరు రోడ్డుపై బైఠాయించిన కాకాణి, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత
వైఎస్సార్‌సీపీ నేతలను నెట్టేసి.. కార్యకర్తలపై లాఠీచార్జ్
కాకాణిని బలవంతంగా నివాసంలో దించేసిన పోలీసులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాయలసీమతోపాటు నెల్లూరు జిల్లా ప్రజలు, రైతుల భవిష్యత్‌ను తెలంగాణ సీఎంకు తాకట్టు పెట్టి.. సీమ ఎత్తిపోతల పథకాన్ని బాబు సర్కారు నిలిపివేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు శనివారం చేపట్టిన సోమశిల ప్రాజెక్ట్ సందర్శనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడా లేని ఆంక్షలతో వేకువజాము నుంచే ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి నివాసాలకు పోలీసులు చేరుకుని హౌస్ అరెస్ట్‌లతో నానాహంగామా సృష్టించారు. సోమశిల డ్యామ్ సందర్శనకు వెళ్తే శాంతిభద్రతలు అదుపు తప్పుతాయని నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించారు.
రైతుల ప్రయోజనాలు తాకట్టు
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని సీఎం చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేయడంపై శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వైఎస్సార్‌సీపీ పిలుపునిచి్చంది. జిల్లాలోని రైతులు సోమశిలకు చేరుకుని వారికి జరిగే అన్యాయంపై మీడియాతో మాట్లాడేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. సీమ ఎత్తిపోతల పథకం నిలిపివేతతో జరిగే నష్టాలపై జిల్లా రైతులు కన్నెర్ర చేయడంతో ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందోనని భయపడిన ప్రభుత్వ పెద్దలు ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగించారు.
సోమశిల ప్రాజెక్టు వద్దకు ఎవరినీ వెళ్లనివ్వకుండా అన్ని ప్రాంతాల్లో పోలీసులు కఠిన ఆంక్షలు పెట్టారు. రహదారులపై బారికేడ్లు పెట్టి రైతులను అడ్డుకున్నారు. నెల్లూరు నుంచి పొదలకూరు మీదుగా సోమశిల ప్రాజెక్టుకు వెళ్లే రహదారిపై మూడుచోట్ల, సర్వేపల్లి నియోజకవర్గంలోని రైతులను నిలువరించేందుకు రెండు ప్రాంతాలతోపాటు అనంతసాగరం మండలం ఉప్పలపాడు హైవే వద్ద బారికేడ్లు పెట్టి రైతులను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేసి ఉక్కుపాదం మోపారు.
కాకాణి నివాసం వద్ద ఉద్రిక్తత
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సోమశిల ప్రాజెక్టు సందర్శన కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన కాకాణిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీఐ శ్రీనివాసరావు పోలీసు బలగాలతో వేకువజాము నుంచే కాకాణి నివాసం వద్ద కాపు కాశారు. ఆయనకు నోటీసు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్యతోపాటు వందలాది మంది కార్యకర్తలు కాకాణి నివాసం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సోమశిల ప్రాజెక్టు సందర్శన కోసం వెళ్లడం నేరమా? అంటూ కాకాణి వాహనం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు బలవంతంగా నెట్టేశారు. దీంతో కాకాణితోపాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పోలీసు ఆంక్షలకు నిరసనగా నెల్లూరులోని పొదలకూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు గంటపాటు రహదారిని దిగ్బంధించడంతో రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు నేతృత్వంలో సీఐలు, ఎస్‌ఐలు, అదనపు బలగాలు నేతలను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి కాకాణి నివాసంలో ఉంచి హౌస్ అరెస్ట్ చేశారు.
కార్యకర్తలపై లాఠీచార్జి
కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకునే సమయంలో కార్యకర్తలు ఆయనకు అడ్డుగా నిల్చోవడంతో పోలీసులు లాఠీలతో చితక్కొట్టారు. కొందరు కానిస్టేబుళ్లు అత్యుత్సాహం ప్రదర్శించి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను లాఠీలతో చావబాదారు. పోలీసుల అత్యుత్సాహంపై మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. తాము శాంతియుతంగా సోమశిల ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం చేపడితే పోలీసులు అత్యుత్సాహం ఏమిటని ప్రశి్నంచారు. పోలీసుల ఓవర్ యాక్షన్ చేస్తే గుర్తు పెట్టుకుంటామని, ఎవరిని వదిలి పెట్టబోమని మండిపడ్డారు.


