హాంకాంగ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తాయ్ జిల్లాలోని నూతనంగా నిర్మిస్తున్న ఒక బహుళ అంతస్థుల భవన సముదాయంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా మరో నలుగురు గాయపడ్డారు. మరి కొంతమంది మంటలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళాలు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే యత్నం చేస్తున్నాయి.
కాగా గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు సమాచారం. నిర్మాణంలో ఉన్న భవంతి కావడంతో వెలుపలి భాగంలో వెదురుబొంగులను అమర్చారు. మంటలు వాటికి అంటుకోవడంతో పెద్దఎత్తున అగ్నిజ్వాలలు ఎగిసిపడి దట్టమైన పొగ కమ్ముకుంది. మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.
తాయ్ పో నగరం హాంకాంగ్ ఉత్తర భాగంలో ఉంటుంది. హాంకాంగ్‌లో భవన నిర్మాణరంగంలో వెదురు బొంగుల వాడకం అనేది సర్వసాధారణం. వీటి వల్ల భద్రతా సమస్యలు ఏర్పడుతున్నాయని ప్రభుత్వానికి ఇది వరకే అక్కడి అధికారులు నివేదించినట్లు తెలుస్తోంది. దానిపై స్పందించిన అక్కడి ప్రభుత్వం నిర్మాణం రంగంలో వెదురుబొంగుల వాడకం దశలవారీగా తొలిగిస్తామని ఈ ఏడాది ప్రారంభంలో తెలిపినట్లు సమాచారం.


