ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా.. వెనెజువెలాపై సైనిక చర్యను చేపట్టిన ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించి తమ దేశానికి తీసుకొచ్చింది అమెరికా. ఈ ఘటనను పలు దేశాలు ఖండించగా.. ఇది తమ దేశ భద్రతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, వెనెజువెలా మంచి కోసం కూడా చేశామంటూ డొనాల్డ్ ట్రంప్ తన చర్యను సమర్థించుకున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విషయంలోనూ ఇలా చేస్తారా? అనే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
ఉక్రెయిన్ యుద్ధంలో కాల్పుల విరమణ, శాంతి ప్రణాళిక ఒప్పందం కోసం ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తొలినాళ్లలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ మీద మండిపడ్డ అగ్రరాజ్యం అధ్యక్షుడు.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మీద సాఫ్ట్ టోన్ ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే గత కొంతకాలంగా ఆ పరిస్థితి మారింది. పైగా వెనెజువెలా చమురు విషయంలో రష్యాకు సంబంధించిన షాడో ఫ్లీట్ సీజ్ నేపథ్యంలో.. అమెరికా-రష్యాల మధ్య వార్నింగ్ ఇచ్చుకునే స్థాయిలో పరిస్థితి చేరుకుంది. ఈ తరుణంలో..
వెనెజువెలా రాజధాని కారకస్‌పై జనవరి 3వ తేదీన అమెరికా వైమానిక దళాలతో మెరుపు దాడులు చేసి మదురోను బంధించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ నేరాల అభియోగాలతో ఆయన్ని అమెరికా ఫెడరల్ కోర్టులు విచారణ చేస్తున్నాయి. ఈ పరిణామంపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. కొలంబియా అధ్యక్షుడా?, ఇరాన్ సుప్రీం లీడరా?అమెరికా అధ్యక్షుడి నెక్ట్స్ టార్గెట్ ఎవరై ఉంటారా? అనే చర్చా జోరందుకుంది. అమెరికా చమురు–గ్యాస్ కంపెనీల అధిపతులతో సమావేశంలో.. పుతిన్‌ను అలా బంధిస్తారా? అని మీడియా వేసిన ప్రశ్నకుగానూ ట్రంప్ సమాధానం ఇచ్చారు. పుతిన్‌ను పట్టుకోవడం అవసరం లేదు, కానీ నేను ఆయన విషయంలో చాలా నిరాశలో ఉన్నాను అని అన్నారు. ఇప్పటిదాకా తాను ఎనిమిది యుద్ధాలను ముగించానని, కానీ ఉక్రెయిన్ సంక్షోభాన్ని మాత్రం త్వరగా ఆపలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. మరోవైపు... ఇదే అంశంపై పరోక్షంగా జెలెన్‌స్కీ కూడా స్పందించారు.
మదురో అరెస్టు తర్వాత పుతిన్‌పై కూడా అమెరికా ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదంటూ వ్యాఖ్యానించారు. ఒక నియంతను(పుతిన్‌ను ఉద్దేశిస్తూ..) ఇలా ఎదుర్కోవాలంటే.. తర్వాత ఏం చేయాలో అమెరికాకు తెలుసు’’ అని వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం 2022 ఫిబ్రవరి 24న మొదలైంది. అయితే యుద్ధ నేరాల ఆరోపణలతో ది హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వ్లాదిమిర్ పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాధినేతగా పుతిన్‌కంటూ ఓ పేరుంది. అలాంటిది ఆయన్ని అంత తేలికగా నిర్బంధించడం అమెరికాకు కలలో కూడా సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం అంతర్జాతీయ విశ్లేషకుల నుంచి ఎదురవుతోంది.


