సవకతోటల్లో మంటలు ఆర్పుతున్న పోర్టు సెక్యూరిటీ సిబ్బంది
పెట్రోల్ రిఫైనరీ సమీపంలో ఎగసిపడిన మంటలు
ముత్తుకూరు (పొదలకూరు): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు సముద్ర తీర ప్రాంతంలోని బీపీసీఎల్ పెట్రోల్ రిఫైనరీ కంపెనీ సమీపంలో అగ్నికీలలు ఎగసి పడ్డాయి. ఆదివారం కావడంతో తీరానికి వచ్చిన పర్యాటకులు ఎవరో సమీపంలోని సవక తోటల్లో నిప్పు రాజేయడంతోనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అదానీ కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ అధికారులు మంటలను సీసీటీవీ ఫుటేజీలో పరిశీలించి అప్రమత్తమయ్యారు. మెరైన్ పోలీసులకు సమాచారం అందించి, మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పోర్టు పరిధిలోని తీర ప్రాంతంలో బీపీసీఎల్ పెట్రోల్ రిఫైనరీ, గ్యాస్ కంపెనీలు ఉన్నాయి.
వీటికి 200 మీటర్ల సమీపంలోనే మంటలు ఎగసిపడడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందారు. పర్యాటకులపై ఆంక్షలు లేకుండా పోయాయని తీరప్రాంత గ్రామస్తులు అంటున్నారు. దీనికితోడు సెక్యూరిటీ వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల పేరుతో కొందరు ఆకతాయిలు వచ్చి సవక తోటల్లో పార్టీలు చేసుకుంటూ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ గ్యాస్ కంపెనీలు ఉన్న తీర ప్రాంతంలో నిరంతరం పర్యవేక్షణ ఉండాలంటున్నారు.


