బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు నానాటికీ పెరుగుతున్నాయి. ఇటీవలే ఇస్లాం వ్యతిరేఖ ఆరోపణలతో పలువురు హిందు మతానికి చెందిన వ్యక్తులుపై దాడి చేసి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా సునాంఘంజ్ అనే జిల్లాలో జోయ్ మహాపాత్ర అనే యువకుడిపై దాడి చేసి అనంతరం విషం ఇచ్చి చంపినట్లు అక్కడి మీడియా కథనాలు తెలిపాయి.
బంగ్లాదేశ్ హింసతో అట్టుడికిపోతుంది ఇటీవల అక్కడి స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ మృతితో హిందువులపై తిరిగి మెుదలైన దాడులు ఏమాత్రం శాంతించడం లేదు. గడిచిన 40 రోజుల్లోనే 12 మంది హిందువులు హత్యకు గురయ్యారంటే పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ దాడులకు స్పష్టమైన కారణం ఏమి లేకపోయినప్పటికే.. అక్కడి మత ఛాందసవాదులు హిందువులే టార్గెట్‌గా దాడులు జరుపుతున్నారనేది కాదనలేని సత్యం
ఈ నేఫథ్యంలో హత్యలను భారత్ పలుమార్లు ఖండించింది మైనార్టీలపై దాడులు అరికట్టాలని కోరింది. ఇటీవల ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా అంత్యక్రియలకు సైతం భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాజరయి సంతాపం ప్రకటించారు.పరిస్థితులను కొంత అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడి మతఛాందస వాదులు విద్వేశాన్ని చిమ్మడం ఆపడం లేదు.
తాజాగా సునాంఘంజ్ జిల్లాలో జోయ్ మాహాపాత్ర అనే హిందూ యువకునిపై అక్కడి అల్లరిమూకలు దాడి చేశాయి. అతనిని తీవ్రంగా కొట్టి అనంతరం విషం ఇచ్చాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహాపాత్రను ఉస్మానీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ 2026 ప్రారంభమై పదిరోజుల కూడా కాకముందే బంగ్లాదేశ్‌లో నలుగురు హిందువులు హత్యకు గురయ్యారు.
నూతన సంవత్సర వేడుకల వేళ షరియత్ పూర్ జిల్లాలో ఖోకన్ చంద్రదాస్ అనే వ్యక్తిపై దాడిచేసి చంపారు. జనవరి 5న హిందూ వార్త సంపాదకుడు రాణా కాంతి బైరాగిని కాల్చిచంపారు. అనంతరం నర్సింగి జిల్లాలో వ్యాపారి మణి చక్రవర్తి ప్రాణాలు తీశారు. తాజాగా మహాపాత్ర అనే యువకుడిని విషం ఇచ్చి చంపారు. బంగ్లాదేశ్‌లో ఇంత పెద్దఎత్తున హిందువులపై దాడులు జరగడం భారత్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది.


