సాక్షి, హైదరాబాద్: సోమవారం రాత్రి ఓల్డ్ సిటీలోని శాలిబండ క్లాక్ టవర్ పక్కన ఉన్న గోమతి ఎలక్ట్రానిక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ ఘటనలో దుకాణం సమీపంలో ఆగి ఉన్న ఒక కారు, ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమయ్యాయి. CNG వాహనం అయిన ఆ కారు గ్యాస్ సిలిండర్ నుండి మంటలు చెలరేగిన వెంటనే పేలిపోయింది. దాంతో మంటలు మరింత తీవ్రమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారందరినీ వెంటనే చికిత్స కోసం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు.
స్థానికులు చెప్తున్న వివరాలు.. షాప్ ముందు పార్క్ చేసిన కారుకు మంటలు వేగంగా వ్యాపించాయి. ఆ కారులో ఉన్న డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. కారు పేలుడు వల్ల అగ్నిప్రమాదం జరిగిందా? లేక షాప్‌లో ఉన్న కంప్రెషర్ పేలుడే అసలు కారణమా? అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.
పేలుడు శబ్దాలు వినిపించగానే పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం క్లూస్ టీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.


