సాక్షి, హైదరాబాద్: బోరబండ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ కౌన్సిల్ సమావేశంలో తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాగంటి గోపీనాథ్ చనిపోయినా ఆయన అనుచరుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. మా ఇంటికి ఇటీవల వచ్చిన బెదిరింపు లేఖలో నన్ను చంపేస్తామని రాశారు. ఎవరో తెలియని వ్యక్తి పంపిన ఆ లేఖపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.
తనను హత్య చేసేందుకు పెద్ద స్థాయిలో కుట్ర జరుగుతోందని బాబా ఆరోపించారు. దానిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. నేను, నా కుటుంబం తీవ్ర భయాందోళనలో ఉన్నాం. మాకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు.
ఇటీవల వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిన సర్దార్ మరణాన్ని తనపై మోపే ప్రయత్నం చేశారు. దీనివల్ల రాజకీయంగా తనను దెబ్బతీయాలని కొందరు యత్నిస్తున్నారని ఆరోపించారు.
దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని, వారు అంతర్గతంగా విఘాతం సృష్టిస్తున్నారని బాబా తీవ్రస్థాయిలో విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో నవీన్ యాదవ్‌కు 50 వేల మెజారిటీ రావాల్సింది. అంత మెజారిటీ రాకుండా అడ్డుకున్నది కాంగ్రెస్‌లోని కోవర్టులే అని ఆరోపించారు. బాబా చేసిన ఈ కామెంట్‌లపై పోలీసులు పూర్తి దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం.


