2026లో కుటుంబ శ్రేయస్సు, వ్యక్తిగత పరివర్తన, ఆప్తులకు ప్రాధాన్యం
కుటుంబం, స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేందుకు మొగ్గు
పదిలో 8 మంది భారతీయులు. 2026 మెరుగ్గా ఉంటుందనే భావనలో....
ట్రంప్ సుంకాలు, ఉగ్రవాద దాడి భయాలు, ఆర్థిక మాంద్యం సంభావ్యత, వారి స్థానిక ప్రాంతంలో భద్రత ఇతర రూపాల్లో వెంటాడుతున్న భయాలు
ఇప్సాస్ గ్లోబల్ ప్రిడిక్షన్స్– 2026 సర్వేలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది పట్ల భారతీయుల్లో ఆశావహ దృక్పథం వ్యక్తమవుతోంది. కుటుంబ శ్రేయస్సు, వ్యక్తిగత పరివర్తన, ఆప్తులకు ప్రాధాన్యం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేందుకు మొగ్గుచూపనున్నారు. ఇటీవల నిర్వహించిన ఇప్సాస్ గ్లోబల్ ప్రిడిక్షన్స్– 2026 సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా అత్యంత ఆశావహ వైఖరిని కనబరిచిన వారిలో 90 శాతంతో ఇండోనేసియన్లు ప్రథమ స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో కొలంబియా–89%, చీలి, థాయ్‌లాండ్, పెరు 86%తో కాస్త ముందంజలో ఉండగా, ఇండియన్లు 81 %గా నిలిచారు.
భారత్‌లో జరిపిన పరిశీలనలో పాల్గొన్న వారిలో...పది మందిలో 8 మంది 2026 మెరుగ్గా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. 30 దేశాల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో ప్రధానంగా రాబోయే జీవితం, కొత్త సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లు, ఆర్థిక దృక్పథాలు కుటుంబానికి వెచి్చంచే సమయం, వ్యక్తిగత వృద్ధి, ప్రపంచ ఫుట్‌బాల్ పట్ల ఆసక్తి, ఏఐ విస్తృత వినియోగంలోకి వస్తున్న నేపథ్యంలో ఉద్యోగాలు, ఉపాధిపరంగా ఎదురయ్యే కష్టనష్టాలు, ఆందోళనలు తదితరాలపై అభిప్రాయాలు సేకరించారు.
2026 గురించి ఇలా...
వ్యక్తిగత ప్రాధాన్యాలకు మించి ప్రపంచ, జాతీయ పరిణామాలకు అధిక ప్రాధాన్యం ఏర్పడిందని సర్వేలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. పది మందిలో ఎనిమిది మంది భారతీయులు 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని చెప్పగా, ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్, చిలీ పౌరులు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.
⇒ సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం 2026లో ముగియాలని ఇద్దరు భారతీయులలో ఒకరు కోరుకుంటున్నారు. ఇతర దేశాల్లోని ప్రజల అభిప్రాయాలతో సరిపోల్చిస్తే, 2026లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి రావొచ్చని భారతీయులు సైతం అంచనా వేస్తుండడం విశేషం.
⇒ పది మందిలో ఆరుగురు భారతీయులు 2026లో ప్రపంచ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే వారి ఆందోళన స్థాయి ఇండోనేసియా, సింగపూర్ పౌరుల కంటే తక్కువగా ఉంది. ఆ దేశాల్లో పది మందిలో తొమ్మిది మంది పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్‌ను అంచనా వేస్తున్నారు. ఇద్దరు భారతీయుల్లో ఒకరు 2026లో తీవ్రమైన వాతావరణ సంఘటనలకు భయపడుతున్నారు.
⇒ భారతీయుల ప్రాధాన్యతలు వ్యక్తిగత శ్రేయస్సు, కుటుంబ సంబంధాలపై బలంగా కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ ఏడాది కుటుంబం, స్నేహితులతో ఎక్కువ సమయం గడపాలని 82% కోరుకుంటున్నారు. ఈ భావన ఇండోనేసియా, రొమేనియా, మలేసియా వంటి దేశాల్లోనే కనిపించింది.
⇒ పది మందిలో ఎనిమిది మంది భారతీయులు వ్యాయామాని కి అధిక ప్రాధాన్యం ఇచ్చి, ఎక్కువ సేపు ఇందులో గడపాలని భావిస్తున్నారు. 2025లో దీనిని నిర్లక్ష్యం చేశామన్న అపరాధ భావం కారణంగా కొత్త సంవత్సరంలో ఆ విధంగా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైంది.
⇒ భారత్‌లో సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ శాతం మంది గతేడాదితో పోల్చిస్తే 2026లో సోషల్ మీడియాకు వెచి్చంచే సమయాన్ని గణనీయంగా తగ్గించడంతోపాటు సమతుల్యత, వ్యక్తిగత శ్రేయస్సు, మెరుగుదల దిశలో మరింత కృషి సాగించాలని భావిస్తున్నారు.
సర్వే ముఖ్యాంశాల్లో మన దేశానికి సంబంధించి...
అధిక ఆశావాదం: భారతీయుల్లో అధిక స్థాయిల్లో ఆశావాదం వ్యక్తమైంది. 2026 మెరుగ్గా ఉంటుందని 81% మంది ఆశిస్తున్నారు
ప్రాధాన్యాలు: ఈ ఏడాది కీలకమైన భారతీయ ప్రా ధాన్యతలలో కుటుంబ సమయం (82%), ఫిట్‌నెస్, వ్యక్తిగత శ్రేయస్సు వంటి వాటికి పెద్దపీట వేశారు.
ఏఐ ఆందోళనలు: 62% మంది ఇండియన్లు ఏఐ వల్ల ఉద్యోగ నష్టాలు ఎదురు కావొచ్చునంటున్నారు. అయితే 57% మంది కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని భావిస్తున్నారు
రక్షణ–భద్రతా భయాలు: వ్యక్తిగత రక్షణ, భద్రతల విషయంలో ఒకింత నిరాశావాదం వ్యక్తమైంది. తమ ప్రాంతం తక్కువ సురక్షితంగా మారుతుందని 55% మంది భావిస్తున్నారు. పెద్ద ఉగ్రవాద దాడి జరగొచ్చునని 53% మంది భయపడుతున్నారు
⇒ 2026లో అనేక సంభావ్య ముప్పులను కూ డా గుర్తించారు. వీటిలో పెద్ద ఉగ్రవాద దా డి భయాలతో పాటు ఆర్థిక మాంద్యం సంభావ్యత, ప్రజల్లో అశాంతి, అక్రమ వలసలకు సంబంధించిన ఆందోళనలు ఉన్నాయి.
⇒ గతేడాది దేశానికి, సొంత కుటుంబాలకు నష్టదాయకంగా పరిణమించిందని కొందరు అభివర్ణించారు.
గతేడాది కఠినమే
2025 పలువురు భారతీయులకు కఠినమైన సంవత్సరంగా నిలిచింది. ఆర్థిక ఒత్తిళ్లు, ఆపరేషన్ సిందూర్ ద్వారా పూర్తిస్థాయి యుద్ధం, తీవ్రమైన వాతావరణ ప రిస్థితులు, ట్రంప్ సుంకాల విధింపు–ఉద్యోగాల కోత లు, ఇతర సవాళ్ల నేపథ్యంలో ఇండియన్లు 2026 పట్ల ఆశావాద దృక్పథాన్ని కనబరుస్తున్నారు. 2025 కంటే 2026 మెరుగ్గా ఉంటుందని నమ్ముతున్నారు. కుటుంబం, స్నేహితులతో బంధానికి అధిక ప్రాధాన్యం, వ్యక్తిగత శ్రేయస్సుపై దృష్టి కేంద్రీకరణ, ఈ ఏడాది జరిగే ఫిఫా వరల్డ్‌కప్‌పై అధిక ఆసక్తి వంటివి వెల్లడయ్యాయి. – సురేశ్ రామలింగం, సీఈఓ, ఇప్సాస్ ఇండియా


