వెహికల్–టు–వెహికల్ కమ్యూనికేషన్ వ్యవస్థ
ప్రమాదం పొంచి ఉంటే డ్రైవర్లకు ముందే హెచ్చరిక
రోడ్డు ప్రమాదాల కట్టడికి కేంద్ర ప్రభుత్వ ఆలోచన
భారత్‌లో ఈ ఏడాదే టెక్నాలజీ అందుబాటులోకి..
రోడ్డు ప్రమాదాలు.. నిత్యం మనం వింటున్నవే. అయితే మారేది తీవ్రత మాత్రమే. కొత్త బండ్లు ఏ రీతిన పెరుగుతున్నాయో.. ప్రమాదాలు కూడా అదే స్థాయిలో అధికం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా 2023లో 4,80,583 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటి కారణంగా 1,72,890 మంది మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రాణ నష్టం జరిగిన తర్వాత స్పందించే బదులుగా ప్రమాదం జరిగే అవకాశాలను తగ్గించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అన్ని విభాగాల్లో కలిపి దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో 2,56,07,391 కొత్త వెహికల్స్ రోడ్డెక్కాయి.
కొన్నేళ్లుగా ఏటా కోట్లాది వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. ఇంకేముంది ప్రమాదాలూ పెరిగి లక్షలాది కుటుంబాలకు తీరని శోకం మిగిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెహికల్–టు–వెహికల్ (వీ2వీ) కమ్యూనికేషన్ టెక్నాలజీని భారత్‌లో ప్రవేశపెట్టాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. 2026 చివరి నాటికి ఈ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రమాదం జరిగే అవకాశాలను తగ్గించేందుకు ఈ సాంకేతికత దోహదం చేస్తుందని ప్రభుత్వం ధీమాగా ఉంది.
ఇంటర్నెట్ అవసరం లేకుండా..
నెట్‌వర్క్, ఇంటర్నెట్ అవసరం లేకుండా వాహనాలు ఒకదానితో ఒకటి నేరుగా షార్ట్ రేంజ్ వైర్‌లెస్ సిగ్నల్స్ ద్వారా సంభాíÙంచుకోవడానికి ఈ సాంకేతికత వీలు కల్పిస్తుంది. రహదారుల మీద పార్క్ చేసిన వాహనాలను అదే మార్గంలో వేగంగా ప్రయాణించే ఇతర వాహనాలు ఢీకొట్టకుండా నివారించడంలో ఈ సాంకేతికత ప్రభావవంతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. శీతాకాలంలో దట్టమైన పొగమంచు సమయంలో యాక్సిడెంట్లను నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఈ వ్యవస్థ ద్వారా వాహనాలు సిగ్నల్స్‌ను ఒకదానితో మరొకటి ఇచ్చిపుచ్చుకుంటాయి.
మరొక వాహనం ప్రమాదకరంగా దగ్గరగా వచ్చినప్పుడు డ్రైవర్లకు హెచ్చరికలను పంపుతాయి. వాహన స్థానం, కదలిక దిశ, వేగంలో మార్పులు, బ్రేకులు వేస్తున్న తీరు ఏవిధంగా ఉందో వంటి సమాచారం ఇతర వాహనాలకు చేరవేస్తుంది. ముందున్న వాహన వేగం నెమ్మదించడం వంటి ప్రమాదకర పరిస్థితిని గుర్తించినప్పుడు డ్రైవర్‌కు హెచ్చరిక పంపుతుంది. స్పందించే సమయం పరిమితంగా ఉన్నా, దారి కనిపించని పరిస్థితుల్లో కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఈ వ్యవస్థకు సాంకేతిక ప్రమాణాలు, కమ్యూనికేషన్ ప్రొటోకాల్స్‌ను ఖరారు చేయడానికి ప్రభుత్వం వాహన తయారీ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా అమలుకోసం రేడియో స్పెక్ట్రమ్ ప్రత్యేకంగా కేటాయిస్తారు. వాహనాల మధ్య అడ్డంకులు లేని సమాచార మారి్పడి కోసం ప్రత్యేకంగా నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలను అందుబాటులో ఉంచడానికి టెలికం శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది.
రూ.5 వేల కోట్ల బడ్జెట్‌తో..
దేశంలో 36 కోట్లకుపైగా రిజిస్టర్డ్ వెహికల్స్ పరుగు తీస్తున్నాయి. ఈ స్థాయిలో వాహనాలున్న భారత్‌లో వీ2వీ సాంకేతికత అమల్లోకి వస్తే రోడ్డు భద్రత విషయంలో పెద్ద అడుగుపడ్డట్టే. ఇలాంటి సాంకేతికత ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.5,000 కోట్లు ఖర్చవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.
వీ2వీ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రత్యేకతలివీ..
⇒ ఈ వ్యవస్థ వాహనాల్లో ఇన్‌స్టాల్ చేసిన సిమ్ కార్డ్ లాంటి పరికరం ద్వారా షార్ట్ రేంజ్ వైర్‌లెస్ సిగ్నల్స్ ఆధారంగా పనిచేస్తుంది.
⇒ ఈ పరికరం ట్రాఫిక్ లైట్స్‌తో కమ్యూనికేట్ చేయగలదు. అత్యవసర వాహనాలకు ప్రాధాన్యం ఇస్తుంది.
⇒ వాహనదారులకు రూట్ మ్యాప్ ప్లానింగ్‌లో సహాయపడుతుంది.
⇒ మరొక వాహనం ఏ దిశ నుంచి అయినా చాలా దగ్గరగా వచ్చినప్పుడు.. రియల్ టైమ్‌లో హెచ్చరికలు అందుతాయి. పొగ మంచు అధికంగా కురుస్తున్నప్పుడు దారి ఏమాత్రం కనపడదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
⇒ చుట్టూ ఉన్న వెహికల్స్ ఎంత దూరంలో ఉన్నాయో అలర్ట్ చేస్తుంది. వాహనం సమీపిస్తున్నా, రోడ్డు పక్కన నిలిచి ఉన్నా డ్రైవర్లను హెచ్చరిస్తుంది.
⇒ వెహికల్‌కు 360 డిగ్రీల కోణంలో అన్ని వైపుల నుంచి సంకేతాలను అందిస్తుంది.
⇒ ప్రతి వాహనంలో ప్రత్యేక హార్డ్‌వేర్ ఏర్పాటుకు కొన్ని వేలు ఖర్చు అవుతుంది. కానీ ఈ ధరలు ఇంకా వెల్లడి కాలేదు.
⇒ 2026 చివరి నాటికి ఈ సాంకేతికతను నోటిఫై చేయడానికి రవాణా మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది.
⇒ తొలుత ఈ పరికరాలను కొత్త వాహనాల్లో (ప్లాంట్లలోనే) ఇన్‌స్టాల్ చేస్తారు.
⇒ ఇతర అన్ని వాహనాల్లో దశలవారీగా అమలు చేస్తారు.


