ప్రజల ఆరోగ్యమే నా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి
ప్రజా ఆరోగ్య విధానాల మెరుగుకు వైద్యుల సహకారం కీలకం
స్కిల్స్‌ను అప్‌డేట్ చేసుకోవడం మానేస్తే కెరీర్‌కు ముగింపు పలికినట్టే..
హైదరాబాద్ లైఫ్‌సైన్స్, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది..
గుండె జబ్బులు నివారించే మిషన్‌లో వైద్యులు భాగస్వాములవ్వాలి
ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్‌లో సీఎం పిలుపు
సాక్షి, హైదరాబాద్: డాక్టర్లు కేవలం వైద్య నిపుణులే కాదు.. సమాజానికి దిక్సూచి వంటివారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ‘నేను డాక్టర్‌ను కాదు.. కానీ సోషల్ డాక్టర్‌ను. ప్రజల ఆరోగ్యమే నా బాధ్యత’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో శనివారం ఫెలోస్ ఇండియా సదస్సులో భాగంగా ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ (ఐసీఆర్‌టీఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి వైద్య సదస్సును నిర్వహించడం గర్వకారణమని చెప్పారు. ఈ సదస్సుకు భారత్‌తోపాటు ఆగ్నేయాసియా దేశాల నుంచి 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులు హాజరుకావడాన్ని ఆయన అభినందించారు.
ఇప్పటికే సక్సెస్‌ఫుల్ కార్డియాలజిస్టులైన డాక్టర్లు కూడా జ్ఞానం, నైపుణ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో ఈ సదస్సుకు రావడం అభినందనీయమన్నారు. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యమని, కొత్త విషయాలు తెలుసుకోవడం, స్కిల్స్‌ను అప్‌డేట్ చేసుకోవడం మానేస్తే కెరీర్‌కు ముగింపు పలికినట్టేనని పేర్కొన్నారు. సాంకేతికత అతివేగంగా మారుతున్న నేపథ్యంలో వైద్య రంగం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వాటితో ముడిపడుతోందన్నారు. అందుకే ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అయితే, ప్రజల నాడి పట్టుకోవడాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దని హితవు పలికారు.
హెల్త్‌కేర్ హబ్‌గా హైదరాబాద్
లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ అనుబంధ రంగాల్లో హైదరాబాద్ ఆవిష్కరణల కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. డాక్టర్లు కావాలని చాలామంది ఆశపడతారని, కానీ అందరికీ ఆ అవకాశం దక్కదని చెప్పారు. అందుకే డాక్టర్లు సమాజంలో ఒక ప్రత్యేక వర్గమని, ప్రజల ప్రాణాలు కాపాడే గొప్ప బాధ్యత మీపైన ఉందని గుర్తుచేశారు. ప్రజా ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం హెల్త్ పాలసీలను మెరుగుపరచడంలో వైద్యుల సహకారం కీలకమని, మీ సలహాలు, సూచనలతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.
గుండె జబ్బులపై అవగాహన కల్పిస్తే...
ఇటీవలి కాలంలో గుండె జబ్బులతో మరణాలు పెరుగుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గుండె జబ్బులను నివారించే మిషన్‌లో అందరూ భాగస్వాములవ్వాలని వైద్యులకు పిలుపునిచ్చారు. విద్యార్థులకు సీపీఆర్ శిక్షణను స్వచ్ఛందంగా అందించేందుకు కార్డియాలజిస్టులు ముందుకొస్తే అనేక ప్రాణాలను కాపాడగలమని చెప్పారు. చాలా సందర్భాల్లో నివారణపై నిర్లక్ష్యం చేస్తామని, కానీ ప్రజలకు అవగాహన కల్పిస్తే సమాజం మొత్తంగా లాభపడుతుందన్నారు.
క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ విషయంలో అందరూ కృషి చేయాలని, ఆరోగ్య సంరక్షణలో భారత్.. వరల్డ్ బెస్ట్‌గా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతీ వైద్యుడు ఉత్తమంగా ఎదగాలన్నదే తన కోరికని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫెలోస్ ఇండియా ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ శరత్ రెడ్డి, మెడికవర్ సీఎండీ డాక్టర్ అనిల్ కృష్ణ, మెడికవర్ సీఈవో డాక్టర్ హరికృష్ణ, మాజీ సీఎస్‌ఐ అధ్యక్షుడు పీసీ రథ్ పాల్గొన్నారు.


