ఉపాధి హామీలో తెలంగాణ 2025–26లో అత్యల్ప సగటు పనిదినాలు
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపా ధి హామీ పథకం కింద నమోదైన అత్యల్ప సగటు పనిదినాల్లో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. ఉపాధి హామీ చట్టం 2025–26 సంవత్సరంలో 9 నెలల్లో 27 అత్యల్ప సగటు పనిదినాలతో ఉత్తరాఖండ్ ప్రథమ స్థానంలో నిలవగా, 28 రోజులతో తెలంగాణ రెండో స్థానంలో సాధించింది. 2025లో ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 దాకా... ప్రతి కుటుంబానికి సగటున 28 రోజుల సగటు పనులను నమోదు చేసింది. ఇదే సమయంలో 100 రోజుల పని పూర్తి చేసిన కుటుంబాల సంఖ్య కూడా తక్కువగానే ఉంది.
తెలంగాణలో కేవలం ఆరు వేల కుటుంబాలు మాత్రమే వంద రోజుల పనిని సాధించాయి. మునుపటి సంవత్సరాలతో పోలిస్తే... ఉపాధి కల్పనలో సవాళ్లు పెరగడంతో పర్సన్ డేస్ గణనీయంగా తగ్గాయి. తెలంగాణలో దాదాపు 20 లక్షల కుటుంబాలు ఈ పథకంలో పాల్గొన్నాయి. తాజాగా 18 ప్రధాన రాష్ట్రాల నుంచి సేకరించిన డేటాను విశ్లేíÙంచగా వివిధ అంశాలు వెల్లడయ్యాయి. వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఈ ఉపాధి పథకం ‘వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్ (గ్రామీణ్) చట్టం’గా అమల్లోకి రానున్న విషయం తెలిసిందే.
అంతకు ముందూ క్షీణతే...
2025లో ఆరునెలల కాలంలో (ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ దాకా) మొత్తం ఉపాధి హామీ పని దినాల్లో 47.6 శాతం మేర (గత ఏడాదితో పోలిస్తే) తగ్గుదల నమోదైంది. తెలంగాణలో ఉపాధి కల్పన గణనీయ తగ్గుదల కనిపించే జూలై–ఆగస్టు నెలల్లోనే కాకుండా.. ఈసారి వేసవి తీవ్రత అధికంగా ఉండటంతో ఏప్రిల్–మే నుంచే ఈ క్షీణత ప్రారంభమైంది. ఈ తరువాతి నెలల్లోనూ పునరుద్ధరణ కాలేదు.
ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా పనిదినాల తగ్గుదల 10.4% మాత్రమే ఉండగా, తెలంగాణలో మాత్రం దానికి నాలుగు రెట్లు అధికంగా ఉండటం ఆందోళనకరంగా మారింది. గత ఏడాది ఇదే సమయంలో ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య 25.33 లక్షల నుంచి 19.94 లక్షలకు (21.3% తగ్గుదల) తగ్గిపోయింది. అలాగే, ప్రతీ కుటుంబానికి లభించిన సగటు పని దినాలు 41 రోజుల నుంచి 27 రోజులకు పడిపోయాయి. ఒక కుటుంబానికి ఏడాదికి రూ.1,686 తక్కువ ఆదాయం (–19.4%) లభించింది.


