రాష్ట్రంలో వేగంగా మారుతున్న వాతావరణం
సాక్షి, హైదరాబాద్: వాతావరణంలో మార్పులు వేగంగా నమోదవుతున్నాయి. చలి కాలం చివరి దశకు చేరుతుండడంతో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో నమోదవుతుండగా...రాత్రి పూట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, వాయుగుండాల ప్రభావం, రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలులతో చలి తీవ్రత పెరుగుతోంది.
చివరి వారంలో ఉత్తర, మధ్య తెలంగాణ, తూర్పు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతాయని, ఆ సమయంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో నమోదు కావొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు ఇదే తరహాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. శనివారం గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 30.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 8.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.


