పరారీలో నిందితుడు
బెంగళూరులో దురాగతం
హతురాలు అన్నమయ్యజిల్లావాసి
అన్నమయ్య జిల్లా: దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ఉంటూ బీబీఎం చదువుతున్న ఏపీలోని అన్నమయ్య జిల్లా యువతి దారుణ హత్యకు గురైంది. నగరంలో మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా బిక్కంవారిపల్లి నివాసులైన రెడ్డప్ప, జగదాంబ దంపతుల కుమార్తె దేవిశ్రీ (21) హతురాలు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఈమె గత మూడేళ్లుగా బెంగళూరులోని ప్రముఖ కళాశాలలో బీబీఎం చదువుతూ బంధువుల ఇంట్లో ఉంటోంది.
ఆదివారం ఉదయం దేవిశ్రీ... ప్రేమ్‌వర్ధన్ అనే స్నేహితునితో కలిసి తన స్నేహితురాలి రూంకి వెళ్లింది. అక్కడే ఆమెను ప్రేమ్‌వర్ధన్ కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న మాదనాయకనహళ్లి పోలీసులు పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నారు. దేవీశ్రీ పెద్దమ్మ మాట్లాడుతూ ఆదివారం 11 గంటలకు స్నేహితురాలి రూంకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిందని, ఏం జరిగిందో తెలియదని, తమకు న్యాయం చేయాలని విలపించింది. దేవిశ్రీ, ప్రేమవర్ధన్ ప్రేమికులని అనుమానాలున్నాయి. ఎందుకు హత్య చోటుచేసుకుందీ అనేది నిందితుడు దొరికితే గానీ తెలియదని పోలీసులు చెబుతున్నారు.
ర్యాగింగ్ చేసేవాడని చెప్పింది
దేవిశ్రీ పెదనాన్న మాట్లాడుతూ కాలేజీలో తనను ఆ యువకుడు ర్యాగింగ్ చేస్తున్నాడని ఆమె చెప్పేదన్నారు. మూడు నెలల క్రితమే తెలిపిందని, కళాశాల వారికి సమాచారమిచ్చినా పట్టించుకోలేదని చెప్పారు. మూడు నెలల్లో కాలేజీ అయిపోతుందని ఇటీవలే చెప్పిందని, అంతలోనే ఘోరం జరిగిందని వాపోయాడు.


