అగ్నికీలల్లో ఆకాశహర్మ్యాలు.. 36 మంది మృతి.. 280 మంది మిస్సింగ్‌ | Massive Fire Multiple High Rise Towers At Wang Fuk Court In Hong Kong | Sakshi
Sakshi News home page

అగ్నికీలల్లో ఆకాశహర్మ్యాలు.. 36 మంది మృతి.. 280 మంది మిస్సింగ్‌

Nov 27 2025 4:35 AM | Updated on Nov 27 2025 4:38 AM

Massive Fire Multiple High Rise Towers At Wang Fuk Court In Hong Kong

హాంకాంగ్‌: వందల జనావాసాలు, చిన్నారుల ఆటపాటలతో ఎప్పుడూ కిటకిటలాడే హాంకాంగ్‌లోని ‘వాంగ్‌ ఫుక్‌ కోర్ట్‌’ ఆకాశహర్మ్యాలు బుధవారం ఒక్కసారిగా జనం హాహాకారాలతో మృత్యుభవనాలుగా మారాయి. అగ్నికీలలు బహుళ అంతస్తుల భవన సముదాయాలను చుట్టుముట్టడంతో జనం ప్రాణభయంతో పరుగులుతీశారు. అప్పటికే వ్యాపించిన మంటలకు 36 మంది సజీవదహనమయ్యారు. మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించిన 37 ఏళ్ల ఒక అగ్నిమాపకదళ సభ్యుడు హోవాయ్‌హోహీ సైతం కాలినగాయాలతో ప్రాణాలు కోల్పోయారు. 280 మంది జాడ గల్లంతైంది.

పెద్ద సంఖ్యలో జనం ఇంకా ఆ భారీ భవనాల్లో చిక్కుకుపోయారన్న వార్త ఇప్పుడు వాళ్ల బంధువుల్లో భయాందోళనల్ని పెంచుతోంది. కేవలం 30 మంది గాయపడ్డారని ప్రభుత్వం చెబుతున్నా పెద్దసంఖ్యలో జనం కాలినగాయాలతో స్థానిక ఆస్పత్రుల్లో చేరారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో దాదాపు ఆనుకుని మొత్తం 8 ఎత్తయిన భవనాలున్నాయి.

అధికారిక గణాంకాల ప్రకారం వీటిల్లో 2,000 అపార్ట్‌మెంట్లలో దాదాపు 4,800 మంది నివసిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని ఫ్లాట్లు నిర్మాణదశలో ఉన్నాయి. మంటలు అంతటా వ్యాపించేలోపే 1,000 మందిని తరలించారు. మంటల్ని ఆర్పేందుకు వచ్చిన వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, తమవారు ఏమయ్యారో తెలీక ఆందోళనతో వచ్చిన వందలాది మంది స్థానికులతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది.

ఆర్పేందుకు అవిశ్రాంతంగా పోరాటం 
బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో భవనాల చుట్టూ ఉన్న ఆకుపచ్చని వస్త్రానికి తొలుత నిప్పు అంటుకుని, తర్వాత అది వెదురు సపోర్ట్‌ నిర్మాణాలను అంటుకుని అంతటా వ్యాపించిందని భావిస్తున్నారు. అగ్ని ప్రమాదం వార్త తెల్సి వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, పారామెడికల్‌ సిబ్బంది, వలంటీర్లు వెంటనే రంగంలోకి దిగారు. అత్యంత ఎత్తయిన వాటర్‌ కేనన్లతో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నంచేస్తున్నారు. అంతెత్తున ఎగసిపడుతూ చుట్టూతా వ్యాపించిన అగ్నికీలలు, దట్టంగా కమ్ముకున్న పొగ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఫైర్‌ఇంజిన్ల నిచ్చెనలు చేరుకోలేని ఎత్తులకు మంటలు వ్యాపించడంతో వాటిని అదుపులోకి తీసుకురావడం కష్టంగా మారింది. ఫ్లాట్లలో చిక్కుకున్న వారిలో వృద్దులే అధికంగా ఉన్నారని తైపో జిల్లా మండలి సభ్యుడు లో హీయూఫుంగ్‌ చెప్పారు. భవనంలో నా ఫ్లాట్‌ ఉందో బుగ్గిపాలైందో అంటూ వూ అనే వ్యక్తి కన్నీరుమున్నీరయ్యారు.‘‘ అంత ఎత్తున మంటలు ఉండటంతో భవనాల లోపలికి వెళ్లడం సాధ్యపడట్లేదు. లోపల ఏం జరుగుతోందో ఊహించలేకపోతున్నాం’’ అని ఫైర్‌ సర్వీసెస్‌ విభాగ డైరెక్టర్‌ ఆండీ యే యుంగ్‌ అశక్తత వ్యక్తంచేశారు.

వెదురే కారణమా? 
హాంకాంగ్‌లో నిర్మాణరంగంలో వెదురు కర్రలను విరివిగా ఉపయోగిస్తారు. తాత్కాలిక మెట్లుగా, ఆవలివైపు గోడ నిర్మాణాల కోసం తాత్కాలిక సపోర్ట్‌ గోడగా వెదురు కర్రలను ఉపయోగిస్తారు. బుధవారం బుగ్గిపాలైన ఆకాశహర్మ్యం చుట్టూతా, నిట్టనిలువునా ఈ వెదురుకర్రలే దర్శనమిచ్చాయి. మంటలకు త్వరగా కాలిపోయే గుణమున్న ఈ కర్రల వాడకానికి తిలోదకాలు ఇవ్వాలని గతంలోనే ప్రభుత్వం చెప్పినా నిర్మాణరంగ సంస్థలు వినిపించుకోవట్లేవు. ప్రమాదం వార్త తెలిసి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement