అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనెజువెలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా తనకు తాను ప్రకటించుకున్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్‌లో స్వయంగా ఆయన ఒక పోస్ట్ చేశారు. ప్రపంచ చరిత్రలోనే ఈ తరహా ప్రకటన.. మొట్టమొదటిది కావడం గమనార్హం.
In his Truth Social post, US President Donald Trump recognises himself as the 'Acting President of Venezuela' pic.twitter.com/A23DlWqIBw
— ANI (@ANI) January 12, 2026
డ్రగ్స్ అభియోగాలతో కూడిన నేరాలకుగానూ.. వెనెజువెలా రాజధాని కారకస్‌పై అమెరికా సైనిక చర్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. జనవరి 3వ తేదీన రాజధాని నగరంపై మెరుపు దాడులు జరిపి.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోరస్‌లను బంధించి న్యూయార్క్‌కు తీసుకెళ్లింది. సుమారు 150 యుద్ధ విమానాలతో అమెరికా వెనెజువెలాపై నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్ని పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.
మదురో అక్రమ అరెస్ట్ తర్వాత వెనెజువెలా అధ్యక్ష స్థానంలో.. ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా కూర్చోబెట్టింది ఆ దేశ సుప్రీం కోర్టు. అయితే.. వెనెజువెలాలో తమ ప్రభుత్వమే ఉంటుందని ఆ సమయంలో ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనపై విమర్శలు రావడంతో.. వెనెజువెలాలో స్థిర ప్రభుత్వం కొలువుదీరేంత దాకా పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని మరో ప్రకటన చేశారు.
ఇప్పటికే వెనెజువెలా చమురుపై సర్వహక్కులు తమవేనని.. ఏ దేశమైనా తమతోనే డీల్ కుదుర్చుకోవాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. తాత్కాలిక అధ్యక్షుడినంటూ ట్రంప్ చేసిన తాజా ప్రకటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఇలాంటి ప్రకటనకు అసలు చట్టబద్ధత ఉంటుందా? అనే ప్రశ్న మొదలైంది.

గతంలో..
గతంలో కొందరు నాయకులు తమ దేశానికి రాజులుగా, అధ్యక్షులుగా ప్రకటించుకున్న ఉదాహరణలు ఉన్నాయి. నెపోలియన్ బోనపార్టే(ఫ్రాన్స్), అహ్మత్ జోగ్(అల్బేనియా), బోరిస్ స్కోసిరెఫ్(అండోరా).. ఈ లిస్ట్‌లో ఉన్నారు. కానీ చరిత్రలోనే.. ఇలా ఒక దేశ అధ్యక్షుడు మరో దేశంపై అధికారాన్ని ప్రకటించుకున్న దాఖలాలైతే లేవు(మీ దృష్టిలో ఏదైనా ఉంటే.. సోషల్ మీడియాలో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు). కాబట్టి ట్రంప్ ప్రకటన అత్యంత అరుదైనదిగా చరిత్రలో నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రకటనపై వెనెజువెలా ప్రభుత్వం, ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.


